
పత్తి కొనుగోళ్లు ఆలస్యం
8% తేమకు రూ.8,110
9% తేమకు రూ.8,028.90
10% తేమకు రూ.7,947.80
11% తేమకు రూ.7,866.70
12% తేమకు రూ.7,785.60
భైంసా/భైంసారూరల్: దసరా పండుగ దాటినా జిల్లాలో పత్తి కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. కేంద్రాల ఏర్పాటు ప్రణాళికే ఖరారు కానట్లు తెలుస్తోంది. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. సాధారణంగా పత్తి పంట దసరా సమయానికి రైతుల చేతికి వస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తారు. ఏటా కొనుగోళ్లు జాప్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఈసారైనా సమయానికి కేంద్రాలు తెరవాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్, కుభీర్, భైంసా ప్రాంతాల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు.
సీసీఐలోనే మద్దతు
పత్తి పంటకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర దక్కుతుంది. ప్రైవేటుగా అమ్మితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు రంగంలోకి దగక ముందే సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ప్రైవేటుగా విక్రయిస్తే పెట్టుబడి కూడా రాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రైతులు పత్తి విక్రయానికి ముందుగా ఆన్‌లైన్ ఆధార్ ధ్రువీకరణతో సంబంధిత కేంద్రాల్లో రిజిస్టర్ కావాల్సిందేనని అధికారులు సూచిస్తున్నారు. పత్తి విక్రయించి వచ్చే మొత్తాన్ని రైతుల ఆధార్ లింక్ బ్యాంక్ ఖాతాల్లోనే డిపాజిట్ చేస్తారు.
యాప్‌లో స్లాట్ బుకింగ్
సీసీఐ తాజా సంవిధానంగా ’కపాస్ కిసాన్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఏఈవోలు సేకరించిన వ్యవసాయ వివరాలు వ్యవసాయ పోర్టల్‌కు అనుసంధానించబడ్డాయి. రైతులు తమ సెల్ ఫోన్ నంబర్‌తో యాప్‌లో నమోదు చేసుకుంటే, జిన్నింగ్ మిల్, పత్తి అమ్మే తేదీ కేటాయించబడుతుంది. అవగాహన లేని వారు తమ క్లస్టరు ఏఈవో ద్వారా కూడా నమోదు చేయవచ్చు.
త్వరలోనే కొనుగోళ్లు
భైంసా మార్కెట్‌లో త్వరలోనే పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. జిల్లాలో భైంసాలోనే అత్యధిక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించాం. రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకే పంట తీసుకురావాలి. ఈయేడు క్వింటాల్ పత్తికి ప్రభుత్వం రూ.8110గా మద్దతు ధర నిర్ణయించింది.
– ఆనంద్‌రావుపటేల్, ఏఎంసీ చైర్మన్
మద్దతు ధర ఇలా..
కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలుకు మద్దతు ధర ప్రకటించింది. పత్తి తేమ శాతం ఆధారంగా ధరలు ఉంటాయి.
12% తేమ శాతానికి మించి ఉన్న, నాణ్యత లేదా వర్షానికి తడిసిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు.