
‘బెస్ట్’ విద్యార్థులు నష్టపోవద్దు
నిర్మల్‌చైన్‌గేట్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో విద్యార్థుల విద్యా బోధనలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా, అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పరిస్థితులపై హైదరాబాదులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భట్టి మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. విద్యార్థుల విద్యా బోధనలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమన్వయం కలిగి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, బడుగు బలహీనవర్గాల పిల్లలకు మౌలిక వసతులతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మెరుగైన విద్యా బోధనకు చర్యలు..
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో భోజన్న, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల అధికారులు దయానంద్, అంబాజీ, మోహన్‌సింగ్ పాల్గొన్నారు.