
యూరియా కన్నా.. ‘నానో’ మిన్న
సంప్రదాయ యూరియా, డీఏపీలు నేలలో కలిసిపోయి 50 శాతం కంటే తక్కువే మొక్కలకు అందుతాయి. నానో ఎరువులను ఆకులపై పిచికారీ చేయడంతో 85 శాతం నేరుగా మొక్కలకు చేరుతుంది.
అధిక రసాయన ఎరువుల వినియోగం నేల సారాన్ని, ఉపయోగకరమైన వానపాములను, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. నానో ఎరువులు ఈ సమస్యను నివారిస్తాయి.
నానో ఎరువులు 8 శాతం అధిక దిగుబడిని అందిస్తాయి.
పంటలకు మిత్రపక్షమైన పురుగులకు హాని కలగకుండా చూస్తాయి.
నానో ఎరువులు నత్రజనిని సులభంగా మొక్కలకు అందిస్తాయి.
లక్ష్మణచాంద: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రసాయన ఎరువులైన యూరియా, డీఏపీకి కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవి ఆర్థికంగా సమర్థవంతమైనవి మాత్రమే కాకుండా పంటలకు, నేల సారానికి కూడా ఉపయోగకరమైనవని పేర్కొంటున్నారు.
ఎరువుల ధరల భారం..
జిల్లా వ్యాప్తంగా యూరియా, డీఏపీ ఎరువులకు డిమాండ్ పెరగడంతో కొందరు వ్యాపారులు ప్రభుత్వ సరఫరా ఎరువులను నిల్వ చేసి, యూరియా సంచి ధరను రూ.266 నుంచి రూ.300–320కి, డీఏపీ సంచిని రూ.1350కి అమ్ముతున్నారు. ఈ ధరల పెంపు రైతులకు భారంగా మారాయి.
నానో ఎరువులు..
వ్యవసాయ అధికారులు నానో యూరియా, నానో డీఏపీ వినియోగాన్ని సిఫారసు చేస్తున్నారు. అరలీటరు నానో యూరియా ద్రవం రూ.200–225కి, నానో డీఏపీ రూ.600కి లభిస్తుంది, ఇవి సంప్రదాయ ఎరువులతో పోలిస్తే ఆర్థికంగా లాభదాయకం. అంతేకాక, 20 నానో యూరియా సీసాలు కొనుగోలు చేసిన రైతుకు రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు, అయితే రసీదు తీసుకోవడం తప్పనిసరి.
లాభాలు
నానో ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువుల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి.