
ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలవాలి
నిర్మల్‌రూరల్: ఉపాధ్యాయులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటీ కన్వెన్షన్ హాల్‌లో బుధవారం డీఈవో భోజన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, 5 డీఏల గురించి అసెంబ్లీలో మాట్లాడుతానన్నారు. జిల్లాను విద్యారంగంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ గురువులు ఆరాధ్య దైవాలని, దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మార్గదర్శకులని అన్నారు. గురువులు నేర్పిన విద్యతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఈ విద్యా సంవత్సరం పదోతరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థి, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తానని ప్రకటించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయసారిణి తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం జిల్లాలో ఎంపికై న 110 మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాల, శాలువాలతో సత్కరించి మెమొంటో అందజేశారు. అంతకుముందు పలు పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వెల్మల్ బొప్పారం ఉన్నత పాఠశాల విద్యార్థులు రచించిన అంకురాలు రెండు కథల సంపుటిని కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈవోలు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలవాలి