
భైంసా మున్సిపాలిటీలో వసూళ్లపై విచారణ..!
భైంసాటౌన్: తమకు వేతనాలు పెంచుతామని చెప్పి సిబ్బంది డబ్బులు వసూలు చేశారని భైంసా మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కా ర్మికులు ఇటీవల ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇతర మున్సిపాలిటీల్లో అధిక వేతనం ఇస్తున్నా.. తమకు మాత్రం తక్కువ వేతనం చెల్లిస్తున్నారని, నాలుగు నెలలుగా పీఎఫ్ డబ్బులు జమ చేయడం లేదని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ డబ్బుల వసూలు పై విచారణకు సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ అధ్యక్షతన ముగ్గురు జిల్లాస్థాయి అధికారులతో కమిటీ వేశారు. భైంసా మున్సిప ల్ కార్యాలయంలో మంగళవారం కమిటీ విచా రణ చేపట్టింది. పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనీస్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్‌కుమార్ విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, ఔట్‌సోర్సింగ్ కార్మికులు, వారికి చెల్లిస్తున్న వేతనాలు, పీఎఫ్, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు, 19 మంది హెల్త్ వర్కర్ల వివరాలు అడిగినట్లు తెలిసింది. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు దాదాపు మూడు గంటలపాటు వివరాలు సేకరించారు. కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నారు.