
మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి
నిర్మల్ రూరల్: మహిళల భద్రత, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, పోలీస్‌స్టేషన్ స్థాయిలో నేరాల నిరోధక చర్యలు కఠినంగా అమలు చేయాలన్నారు. పరిశోధన స్థాయిలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించేందుకు.. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న రౌడీషీటర్లను ముందస్తుగా గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సైబర్ మోసాలు, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలు, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఫేక్ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో భైంసా, నిర్మల్ ఏఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్‌మీనా, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.