
● అమరులకు దక్కని గుర్తింపు ● పాఠాల్లో ‘వెయ్యిఉరులమర్రి’
నిర్మల్: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక సమరంలో జిల్లా సమరయోధులు అసమాన ధైర్యంతో పోరాడారు. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో రాంజీ సారథ్యంలో వెయ్యిమంది అమరులయ్యారు. ఇక నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 1948 వరకు అలుపెరగని పోరాటం సాగించిన వీరులు, వారి త్యాగాలు చరిత్రలో సరైన గుర్తింపు పొందలేదు. ఇతర జిల్లాలు తమ చరిత్రను గౌరవిస్తుండగా, నిర్మల్ గడ్డపై జరిగిన ‘వెయ్యి ఉరుల మర్రి’ దారుణం, సమరయోధుల సాహసాలు విస్మరణకు గురవుతున్నాయి. ప్రతీ సెప్టెంబర్ 17న విమోచన, విలీనం, విద్రోహం, ప్రజాపాలన పేరుతో పార్టీలు, నేతలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ పేరు పెట్టుకున్నా.. ఏమున్నది గర్వకారణం అన్న భావన జిల్లావాసుల్లో నెలకొంది. ఈ గడ్డకు తగిన గౌరవం, గుర్తింపు తీసుకురావడంలో అటు పాలకులు, ఇటు అధికారులు విఫలమవుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణత్యాగాలకు గుర్తింపేది..!?
1857–58లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో నిర్మల్‌లో రాంజీ నేతృత్వంలో వెయ్యి మంది యోధులు ప్రాణత్యాగం చేశారు. వీరి స్మృతిగా జిల్లా కేంద్రంలో నెలకొల్పిన విగ్రహాలు కేవలం చిన్న పరిమాణంలో ఉండటం వారి గొప్పతనానికి న్యాయం చేయలేదు. ఎల్లపల్లి దారిలో ‘వెయ్యి ఉరుల మర్రి’ స్థలంలోని అమరుల స్మారక స్తూపం దుస్థితిలో ఉంది. రక్షణ ఫెన్సింగ్ లేకపోవడంతో ఈ ప్రాంతం తాగుబోతుల అడ్డాగా మారింది. స్మారక స్తూపం వద్ద నాటిన మొక్కలు కూడా సంరక్షణ లేక ఎండిపోయాయి. ఎన్నిసార్లు అక్కడ మర్రిమొక్కలను నాటినా.. కనీసం కాపాడేవాళ్లు లేరు. అమరధామం నిర్మాణం, మ్యూ జియం ఏర్పాటు వంటి హామీలు అమలుకు నోచుకోవడం లేదు. పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ వీరుల త్యాగాలకు తగిన స్థానం కల్పించకపోవడం మరింత ఆవేదన కలిగిస్తోంది.
సమరయోధులనూ మరిచారు..
1947–48లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులను కూడా విస్మరిస్తున్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాం ఆధిపత్యంలోనే ఉంది. ఈ కాలంలో నిర్మల్ పంచాయతీ సమితి పరిధిలో గోపిడి గంగారెడ్డి, గణపతి, బాపూరావు, బోరేగాం గజన్న, లాలు పటేల్, ఏ.రాజన్న, పోశెట్టి, గంగాధర్, శివన్న, గంగారామ్, విఠల్‌రావు, జమునాలాల్, వెంకోబరావు, గాంధారి చిన్న నర్సింహులు, లింగారెడ్డి, సుందర్‌రాజ్, ముడుసు ఎల్లయ్య, అర్గుల గంగాధర్‌గుప్తా, హన్మంత్‌రావు ఠాకూర్ వంటి సమరయోధులు నిర్భయంగా పోరాడారు. వీరు నెలల తరబడి ఔరంగాబాద్ వంటి దూరపు జైళ్లలో ఖైదీలుగా ఉన్నారు. అయినప్పటికీ, ఈ యోధుల త్యాగాలకు జిల్లా అధికార యంత్రాంగం, పాలన వ్యవస్థ నుంచి తగిన గుర్తింపు లభించకపోవడం విచారకరం.
నిర్మల్ చైన్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన
రాంజీగోండ్, కుమురంభీం విగ్రహాలు
స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలి
నిజాం, ఆంగ్లేయసేనలపై పోరాడిన రాంజీగోండు సేన గొప్పతనం అందరికీ తెలియాలి.
వెయ్యి ఉరులమర్రి అమరధామం, రాంజీ మ్యూజియం ఏర్పాటుచేయాలి.
–కై రి శశి, ఏబీవీపీ విభాగ్ కన్వీనర్

● అమరులకు దక్కని గుర్తింపు ● పాఠాల్లో ‘వెయ్యిఉరులమర్రి’