నేటి నుంచి స్వాస్థ్ నారీ– సశక్తి పరివార్ అభియాన్ 15 రోజులు 324 శిబిరాలు జిల్లా వ్యాప్తంగా మహిళలకు వైద్య పరీక్షలు
నిర్మల్‌చైన్‌గేట్: మహిళల ఆరోగ్యం కుటుంబ, దేశ ప్రగతికి మూలస్తంభమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వాస్థ్ నారీ– సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిద్ధమైంది. కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో తగిన సూచనలు అందించింది.
నర్సాపూర్ సీహెచ్‌సీ నుంచి ప్రారంభం..
ఈ అభియాన్ మహిళలకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించడంపై దృష్టి సారిస్తుంది. జిల్లాలోని జీజీహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 17న(బుధవారం) నర్సాపూర్ సీహెచ్‌సీలో మెగా వైద్య శిబిరంతో కార్యక్రమం ప్రారంభమై, షెడ్యూల్ ప్రకారం 98 శిబిరాలు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తారు. 38 మంది స్పెషలిస్టు వైద్యుల్లో 19 మంది శిబిరాల్లో పాల్గొనగా, మిగతా వారు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తారు.
పక్షం రోజులు స్పెషల్ డ్రైవ్
అక్టోబర్ 2 వరకు నిర్వహించే ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఆరోగ్య మహిళా కేంద్రాలు, ఏసీడీ సెంటర్లు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లతోపాటు ‘పోషణ్ మాసం’ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. ఈ శిబిరాల్లో రక్తహీనత నివారణ, క్షయవ్యాధి (టీబీ) పరీక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా పరీక్షలు నిర్వహిస్తారు. గైనకాలజీ, నేత్ర, ఈఎన్టీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్ వైద్యులు పరీక్షలు చేసి, రోగ నిర్ధారణ జరిగితే చికిత్స, మందులు అందిస్తారు.
324 శిబిరాలకు ప్రణాళిక
జిల్లాలో 3 సీహెచ్‌సీలు, 16 పీహెచ్‌సీలు, 73 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, 3 బస్తీ దవాఖానాల పరిధిలో 324 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ప్రతీరోజు ఒక్కో ప్రాంతంలో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీల తర్వాత ఆయుష్మాన్ కేంద్రాల్లో శిబిరాలు కొనసాగుతాయి. ఆశ కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీలు మహిళలను శిబిరాలకు తీసుకొచ్చి వైద్య సేవలు అందేలా చూస్తారు.
అన్ని రకాల పరీక్షలు..
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వుల మేరకు ఈ నెల 17 నుంచి నారీ స్వస్త్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఆయా ఆస్పత్రుల పరిధిలో రోజూ ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తాం. మహిళలకు అన్ని రకాల పరీక్షలు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం.
– డాక్టర్ రాజేందర్, డీఎంహెచ్‌వో
నారీ ఆరోగ్యంపై నజర్