
‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి
నిర్మల్ టౌన్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు స్పందించాలని, సమస్యల పరిష్యారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అమ్మద్ ఆర్డీవో రత్న కళ్యాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనీ సూచించారు. ఈనెల 10న ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన ఉన్నందున అధికారులంతా తమ శాఖలకు సంబంధించిన నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు..
జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా ముగిశాయని కలెక్టర్ తెలిపారు. ఆదివారం రాత్రి వరకు సాగిన వినాయక నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయిందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది, గణేశ్ కమిటీలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, మీడియా ప్రతినిధులకు ఆమె కతజ్ఞతలు తెలిపారు.
జీతాలు విడుదల చేయాలి...
ఐదు నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. అంతేకాకుండా 17 ఏళ్లుగా 104లో ఉద్యోగం చేస్తున్నాం. జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందించాం. మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. – 104 సిబ్బంది
కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం
ఇసుకకు అనుమతి ఇవ్వాలి..
మామడ మండలం వాస్తాపూర్, రాంపూర్ గ్రామాలకు 95 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు ఈ ఇళ్లు నిర్మించాం. 15 రోజుల నుంచి ఇసుక కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. పెంబి మండలం నుంచి ఇసుక తేవడానికి అనుమతి మంజూరు చేయాలి.
– వాస్తాపూర్, రాంపూర్ గ్రామస్తులు
డబ్బులు ఇప్పించండి..
మాది దిలావర్‌పూర్. నా భార్య మంజుల క్యాటరింగ్ చేస్తుంది. 2022లో న్యూ పోచంపాడ్ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాని నా భార్య భోజనాలు పంపింది. ఈ క్యాటరింగ్‌కు సంబంధించిన రూ.80 వేలు ఇప్పటివరకు రాలేదు. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మా డబ్బులు ఇప్పించండి. – సాయిరాం
ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..
జిల్లా కేంద్రంలోని సిద్ధాపూర్ సోఫీ నగర్ ప్రాంతంలో ఉన్న చెరువు సుమారు 38.08 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువును కొంతమంది ఆక్రమించి మట్టితో పూడ్చి ప్రహరీ నిర్మిస్తున్నారు. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇది పర్యావరణానికి స్థానిక ప్రజల నీటి అవసరాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
– ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు

‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి

‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి

‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి

‘ప్రజా’ ఫిర్యాదులపై స్పందించాలి