
దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలి
నిర్మల్ టౌన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలుచేసి దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ జిల్లా ఇన్‌చార్జి నాగభూషణం డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇస్తామన్న రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, నేత, గీత ,బీడీ కార్మికులకు, డయాలసిస్, హెచ్‌ఐవీ రోగులకు ఇస్తామన్న రూ.4 వేల పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 150 నుంచి 200 పనిదినాలు కల్పించి, తేలిక పనులు ఇవ్వాలన్నారు. వివాహ ప్రోత్సాహక బహుమతులు రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 18 నెలలు గడిచినా హామీలు నెరవేర్చలేదని తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజు, జనరల్ సెక్రెటరీ భోజారెడ్డి, గౌరవ అధ్యక్షుడు పి.రాజు, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు నందకుమార్, సాయిచంద్, శనిగారపు రవి, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.