
పార్‌పల్లి హద్దులు చూపిస్తాం
లక్ష్మణచాంద: పార్‌పల్లి గ్రామంలో సర్వే చేయించి గ్రామ సరిహద్దులు చూపిస్తామని తహసీల్దార్ సరిత తెలిపారు. రెండు రోజుల కిందట గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక జేసీబీ, రెండు ట్రాక్టర్లను అడ్డుకొని వాటిని గ్రామంలోకి తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సరిత, మైనింగ్ అధికారులు సోమవారం మైనింగ్ ఆర్‌ఐ ఆనంద్‌రావు, రెవెన్యూ ఆర్‌ఐ నరేందర్‌రెడ్డి పార్‌పల్లి గ్రామానికి వెళ్లారు. గ్రామస్తులతో మాట్లాడారు. మొదట తమ గ్రామ సరిహద్దులు చూపించాలని ఈ సందర్భంగా కోరినట్లు అధికారులు తెలిపారు. దీనిపై తహసీల్దార్ సరితను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఆర్‌ఐ నరేందర్‌రెడ్డిని పార్‌పల్లి గ్రామానికి పంపామని గ్రామస్తులతో మాట్లాడారన్నారు. గ్రామస్తుల విన్నపం ఉన్నతాధికారులకు నివేదించి సర్వే చేపట్టి పొట్లపల్లి(బి), పార్‌పల్లి గ్రామాల సరిహద్దులు చూపిస్తామని వివరించారు.