
తెలంగాణ భాష.. యాసే శ్వాస
ప్రాంతీయ మాండలికంతోనే భాషకు మనుగడ భాష, యాసలో ప్రత్యేకత కనబర్చుతున్న సాహితీవేత్తలు నేడు తెలంగాణ భాషా దినోత్సవం
నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మాతృభాష ప్రాధాన్యతను చాటేలా తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, జానపద గేయాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన చరిత్ర కలిగి ఉంది. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పిన కాళోజీ స్ఫూర్తితో జిల్లాకు చెందిన పలువురు తెలుగు భాషోపాధ్యాయులు, కవులు, సాహితీవేత్తలు, బాలరచయితలు ప్రత్యేకత కనబర్చుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, భైంసా, ఖానాపూర్ ప్రాంతాల్లో స్థానిక భాషల్లో వైవిధ్యం కనిపిస్తుంది. వివిధ రకాల యాసలతో పాటు భాషా మాండలికాలు వాడుకలో ఉన్నాయి. జిల్లాకు చెందిన కవులు కూడా తమ రచనల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తెలంగాణ భాష పరిరక్షణకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 9న సహజకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఏటా తెలంగాణ భాషాదినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం..
కవిత్వం సంక్షిప్తం...అర్థం అనంతం
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత ఉపాధ్యాయులు పత్తి శివప్రసాద్ రచన ప్రత్యేకశైలి సంతరించుకుని ఉంటుంది. తెలంగాణ యాసలో సంక్షిప్త పదాలతో కూడిన వచన కవిత్వంలో వీరిది అందవేసిన చేయి. చిన్నచిన్న వాక్యాలు, పదాల్లో అనంతమైన అర్థం దాగి ఉండేలా వీరి రచనలు ఉంటాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన ఆయన కొన్నేళ్లుగా అవిశ్రాంత సాహితీసేవలో కొనసాగుతున్నారు. ఎనిమిది మాసాలుగా ప్రతీరోజు వీరి కలం వెంట విరిచితమవుతున్న రచనలు పలు సామాజిక మాధ్యమాల్లో సాహితీ అభిమానులు ఇష్టపడుతున్నారు.
తెలంగాణ యాసలో జిల్లా కవుల రచనలు కొన్ని...
‘అవును...నేను ఆదిలాబాదోన్నే’,
మట్టిగోడలు, స్వేచ్ఛకు సంకెళ్లు, పత్తిపూలు, కచ్చురం, అడవి(నవల), కొలిమి అంటుకుంది, నిరుడు కురిసిన కళ, జంగూబాయి.
వ్యవహారికమే భాషకు ఆయువుపట్టు...
తెలంగాణ భాషకు స్థానిక ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషనే ఆయువుపట్టుగా ఉంటుంది. తెలంగాణ యాసలో ‘అవును..నేను ఆదిలాబాదోన్నే’ అనే కవిత సంకలనాన్ని జిల్లాకు చెందిన సాహితీవేత్త అప్పాల చక్రధారి రచించారు. వందలాది మందితో మమేకమయ్యే సందర్భంలోనే భాషకు ఉన్న విభిన్న కోణాలు తెలుసుకోగలుగుతామని ఆయనంటారు. కవులు, రచయితలు తెలంగాణ యాస, భాష ప్రతిబింబించే రచనలకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా తెలంగాణ భాషను ముందు తరాలకు అందివ్వగలుగుతారు. ఉమ్మడి జిల్లా నుంచి అనేకమంది కవులు, రచయితలు వర్ధమాన సాహితీవేత్తలు ఇందుకు తమ స్థాయిలో పాటుపడుతున్నారు. నేరెళ్ల హనుమంతు, తుమ్మల దేవరావు, దామెర రాములు, మడిపెల్లి రాజ్‌కుమార్, అల్లం రాజయ్య, వసంత్‌రావు దేశ్‌పాండే, మురళీధర్, చంద్రమౌళి, సామల రాజవర్ధన్, పోలీస్ భీమేశ్, ఉదారి నారాయణ, తదితర అనేకమంది ఇదే కోవలోకే చెందినవారు కావడం విశేషం.
చిట్టి రచనల్లో గట్టి అర్థం స్ఫూరించేలా...
నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని వెల్మల్ బొప్పారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తెలంగాణ గ్రామీణ జీవన నేపథ్యం యాస, భాష, నుడికారాలతో కూడిన కథల సంపుటిని సమష్టిగా రచించి ఏడాది క్రితం పుస్తకంగా విడుదల చేశారు.. తాజాగా మరి కొంతమంది విద్యార్థులు ‘అంకురాలు–2’ పేరిట మరో పుస్తకాన్ని విడుదల చేసేందుకు శ్రమిస్తున్నారు.. అక్కడి తెలుగు ఉపాధ్యాయుడు కొండూరి పోతన్న మార్గనిర్దేశంలో చిన్నారులంతా కలిసి తెలంగాణ భాష, సంస్కృతిపై వారికున్న మక్కువతోనే కథల సంపుటిని రచించి త్వరలో పాఠకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. గతంలో విడుదల చేసిన తొలి కథల సంపుటిలో చక్కని గ్రామీణ నేపథ్యంతో కూడిన ఇతివృత్తాలను కథాంశాలుగా స్వీకరించి తెలంగాణ యాస, సంభాషణలను గ్రామీణ రైతుల కష్టాలు, జీవనవిధానం స్ఫూరించేలా చేసిన వీరి రచనలు రాష్ట్రస్థాయిలో పలువురు రచయితలు, సాహితీవేత్తల ప్రశంసలు పొందాయి.