
తెరుచుకున్న బాసర ఆలయం
బాసర: రాహుగ్రస్త చంద్రగ్రహణం అనంతరం బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని సోమవారం ఉదయం 4 గంటలకు తెరిచారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి గణపతి పూజ, పుణ్యహావచనం, పంచగవ్య ప్రాశన, మహాసంప్రోక్షణ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, విశేష అభిషేకం, మహా నివేదన, మంత్రపుష్పం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు అన్ని అర్జిత సేవలు, సర్వ దర్శనాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
పోటీ పరీక్షల సాధనకు ప్రత్యేక శిక్షణ
బాసర: యంత్రశాస్త్ర పోటీ పరీక్షల సాధన పరిషత్ (ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ) సహకారంతో యంత్రశాస్త్ర పట్టభద్రుల యోగ్యతా పరీక్ష (గేట్)) అంతర్జాల శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు బాసర ఆర్జీయుకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ అకాడమీ వ్యవస్థాపకులు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాలకృష్ణమూర్తి అంకితభావంతో ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గేట్ శిక్షణా కార్యక్రమాలను అందించడానికి ఏ.సీ.ఈ.అకాడమీ ఒక విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళి దర్శన్ (ఓఎస్డీ), డాక్టర్ చంద్రశేఖర్ (అసోసియేట్ డీన్ కోఆర్డినేటర్) ప్రొఫెసర్ విఠల్ (అసోసియేట్ డీన్, సైన్సెస్) వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

తెరుచుకున్న బాసర ఆలయం