
సినీ ఫక్కీలో దాడికి యత్నం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో కొందరు యువకులు సినీ ఫక్కీ తరహాలో దాడి చేసేందుకు యత్నించారు. బాధితులు పారిపోవడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు ఈనెల 6న ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపూరకు చెందిన గణేశ్ మండలి సభ్యులు గ్రూప్‌గా విడిపోయి పరస్పరం దాడికి పాల్పడ్డారు. సోమవారం కోలిపూరకు చెందిన ఆకుల నితీష్ అలియాస్ టిక్కు, కారింగుల సాయికిరణ్, పరివార్ మణికంఠ అదే కాలనీకి చెందిన కళ్యాణ్, మురార్కర్ నవీన్, కార్తీక్‌తో పాటు పలువురిపై దాడి చేసేందుకు సింహాద్రి సినిమా మాదిరి సైకిల్ గేర్‌విల్‌తో తయారు చేసిన ఆయుధంతో వెళ్లారు. గమనించిన బాధితులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో మురార్కర్ నవీన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కారింగుల సాయికిరణ్, పరివార్ మణికంఠలను అరెస్టు చేయగా ఆకుల నితీన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఆయుధాన్ని తయారు చేసిన వ్యక్తిపై సైతం కేసు నమోదు చేసినట్లు వివరించారు.