
కొలిక్కి వచ్చినట్లేనా..
చెన్నూర్ ఎస్బీఐ కేసులో పురోగతి 19 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ? రెండురోజుల్లో పూర్తి రికవరీకి అవకాశం కోర్టు ద్వారా బ్యాంక్‌కు అప్పగించనున్న పోలీసులు
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐ–2 బ్రాంచిలో కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 20 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు కోంభకోణ కేసును పక్షం రోజుల్లో రామగుండం సీపీ నేతృత్వంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు 90 శాతం పురోగతి సాధించినట్లు తెలిసింది. పోలీసులు సుమారు 19 కిలోల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు తెలిసింది. ఈనెల 3 నుంచి 6 తేదీ వరకు గణేశ్ నిమజ్జనంలో పోలీసు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. సోమవారం పనిదినాలు కావడంతో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బంగారు అభరణాలు రికవరీ చేసే అవకాశం ఉందని సమాచారం.
రికవరీ బంగారం కోర్టు ద్వారానే..
పోలీసులు పూర్తిస్థాయిలో రికవరీ చేసిన బంగారు ఆభరణాలను కోర్టులో అప్పగిస్తారని తెలిసింది. బ్యాంక్ లీగల్ అడ్వయిజర్ బ్యాంక్‌లో మాయమైన ఆభరణాల వివరాలను కోర్టుకు అప్పగించి స్వాధీనం చేసుకుంటారని సమాచారం. ఇదంతా పక్షం రోజులు పడుతుందని తెలిసింది. కోర్టు ద్వారా బ్యాంక్ స్వాధీనం చేసుకున్న తర్వాత బాధితుల వారీగా నగలు పరిశీలించాల్సి ఉంటుంది. 20 కిలోల బంగారు ఆభరణాలు కావడంతో 402 మంది బాఽధితులకు సంబంధించినవి వేరు చేయాలంటే రెండు నెలలు పట్టే అవకాశం ఉందని బ్యాంక్ అధికారులు అంటున్నారు.
నేడు బ్యాంక్ ఎదుట ఆందోళన?
ఎస్బీఐలో గోల్డ్ రికవరీ అయిన తర్వాత ఆభరణా లు ఎప్పుడిస్తారనే అనుమానం బాధితులను వెంటాడుతుంది. పూర్తిస్థాయిలో అధికారులు తమకు ఎప్పుడిస్తారనే సమాచారం లేక సోమవారం బ్యాంక్ ఎదుట ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పలువురు బాధితులు చర్చించుకుంటున్నట్లు తెలిసింది.