
నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్
లక్ష్మణచాంద: పోగొట్టుకున్న ఆభరణాలు, నగదును బాధితురాలికి అప్పగించి ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి..కడెం మండల కేంద్రానికి చెందిన కొంక సుజాత ఖానాపూర్‌లో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమార్తె వివాహానికి 16 తులాల బంగారు ఆభరణాలు నిర్మల్‌లో చేయించింది. శనివారం కుమారుడితో కలిసి బంగారు ఆభరణాలు తీసుకుని బైక్ పక్కన బ్యాగులో ఉంచి మధ్యాహ్నం కడెంకు బయల్దేరారు. ఈక్రమంలో బ్యాగు ఎక్కడో పడిపోయింది. ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లక్ష్మణచాంద మండలం రాచాపూర్‌కు చెందిన ఆటోడ్రైవర్ తక్కల సాయికుమార్ నిర్మల్ నుంచి లక్ష్మణచాంద వెళ్తున్నాడు. నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్ ఫ్‌లైఓవర్ సమీపంలో 61వ జాతీయ రహదారిపై బ్యాగు పడి ఉండడాన్ని గమనించి ఇంటికి తీసుకెళ్లాడు. సోషల్ మీడియాలో చూసిన సాయికుమార్ ఆదివారం బాధితురాలి వివరాలు తెలుసుకున్నాడు. రాచాపూర్‌లో 16 తులాల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును ఆమెకు అందించారు. బ్యాగు అందించి నిజాయితీ చాటిన సాయికుమార్‌ను సుజాత కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.