
డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ హస్తం
కాగజ్‌నగర్‌రూరల్: డ్రగ్స్ ముఠా వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉండటంతోనే చూసీచూడనట్లు వదిలేస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రూ.12వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఓ కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగజ్‌నగర్ మండలం కోసినిలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహారాష్ట్ర పోలీసులు నెల రోజులపాటు కాపుకాసి అన్ని ఆధారాలతో దాడులు చేసి డ్రగ్స్ పట్టుకున్నారని, తెలంగాణ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. డ్రగ్స్ మొక్క ఎక్కడ ఉన్నా గద్దలా పీకేస్తామని, దీని కోసం ఈగల్ అనే ఈ కొత్త డిపార్ట్‌మెంట్ ప్రారంభిస్తామని చెప్పిన సీఎం చర్లపల్లిలో డ్రగ్స్ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.
ఎస్పీఎం కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
సిర్పూర్ పేపరుమిల్లులో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల మిల్లు ప్రమాదంలో ఎన్నం భాస్కర్ అనే కాంట్రాక్టు కార్మికుడు గాయపడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. మిల్లు నుంచి వచ్చే విషవాయువులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సమావేశంలో నాయకులు శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.