
కనీస వేతనాలు అమలు చేయాలి
జైపూర్: సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఇందారం ఐకే–ఓసీపీలో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. తాము గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడే కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత, వైద్య సౌకర్యం, మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన గుర్తింపు సంఘాలు కనీసం వారిని పట్టించుకోలేదన్నారు. తాము తిరిగి మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచిన వెంటనే పర్మినెంట్ కార్మికులకు మాదిరిగా వారికి లాభాల్లో వాటాగా రూ.5 వేలు ఇప్పించినట్లు తెలిపారు. హైపవర్ కమిటీ వేతనాలు, చట్టబద్ధమైన లీవు, సిక్, జాతీయ పండుగల సెలవులు ఇవ్వాలని సంస్థను కోరినట్లుగా తెలిపారు. అనంతరం ఓపెన్‌కాస్టులో పని చేస్తున్న కార్మికులు ఏఐటీయూసీలో చేరగా వారిని యూనియన్‌లోకి ఆహ్వానించారు.