
● ఆగస్టు 23 నుంచి అమలు.. ● పెరుగుతున్న విద్యార్థుల హాజర
లక్ష్మణచాంద: విద్యాశాఖలో సంస్కరణలు చేస్తున్న ప్రభుత్వం పాఠశాలలతోపాటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరుపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్(ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి జూనియర్ కళాశాలల అధ్యాపకులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు ప్రారంభించింది. తాజాగా ఆగస్టు 23 నుంచి విద్యార్థులకు కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రారంభించింది. మరోవైపు కళాశాలలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరు చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టారు.
13 కాలేజీల్లో..
జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు 23 నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ ఆధారిత విద్యార్థి హాజరు నమోదు ప్రారంభమైంది. అధ్యాపకులు మొబైల్ ఫోన్‌ల ద్వారా ఉదయం 9:30 గంటలకు మొదటి తరగతి సమయంలో, మధ్యాహ్నం మొదటి తరగతి సమయంలో రెండో సారి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ విధానం విద్యార్థుల హాజరును క్రమబద్ధీకరించడంతోపాటు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
హాజరు శాతం పెంపే లక్ష్యం..
గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండేది. కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి రాకపోవడం, మరికొందరు కళాశాలకు రాకుండా ఉండటం వల్ల ఉత్తీర్ణత శాతం తగ్గిందని ఉన్నత విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా విద్యార్థి హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు సమాచారం ఎస్‌ఎంఎస్ ద్వారా అందుతుంది. ఈ చర్యతో తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు వెళ్లేలా చూస్తారు. ఈ విధానం అమలు తర్వాత హాజరు శాతం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత మెరుగవుతుందని అధ్యాపకులు తెలిపారు.
జిల్లాలో 4,844 మంది విద్యార్థులు..
జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో మొదటి సంవత్సరంలో 2,592 మంది, రెండవ సంవత్సరంలో 2,252 మంది, మొత్తం 4,844 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 202 మంది బోధన సిబ్బంది, 48 మంది బోధనేతర సిబ్బంది, మొత్తం 250 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
పకడ్బందీగా అమలు
ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆగస్టు 23 నుంచి 13 కళాశాలల్లో ఈ విధానంతోనే విద్యార్థులకు హాజరు నమోదు అమలు చేస్తున్నాం. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది.
– పరశురామ్ నాయక్, ఇంటర్ విద్యాధికారి

● ఆగస్టు 23 నుంచి అమలు.. ● పెరుగుతున్న విద్యార్థుల హాజర