
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాట్లపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులకు ఆహ్వానాలు పంపించాలన్నారు. సీటింగ్ ఏర్పాట్లు క్రమబద్ధంగా ఉండాలని, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా దేశభక్తి ప్రతిబింబించాలని సూచించారు. వేదిక వద్ద తాగునీరు, పండ్లు, ఫలహారాలు విద్యార్థులకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.