
బాల కార్మికుల జీవితాల్లో వెలుగు
● ఆపరేషన్ ముస్కాన్‌తో 57 మందికి విముక్తి ● 42 మందిపై కేసులు నమోదు
నిర్మల్ టౌన్/లక్ష్మణచాంద: బాలలు బడిలో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బాలకార్మికుల విముక్తి కోసం ఏటా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మికులను గుర్తించి వారిని బడిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికుల జీవితాలకు వెలుగునిస్తున్నారు. తాజాగా జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–11 కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 57 మంది బాల కార్మికులను గుర్తించి, వారికి పని నుంచి విముక్తి కల్పించారు. కొందరిని తల్లిదండ్రులకు అప్పగించగా, మరికొందరిని పాఠశాలల్లో చేర్పించారు. పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మిక, విద్య, ఆరోగ్య, బాలల సంరక్షణ విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది. నిబంధనలకు విరుద్ధంగా బాలలతో పని చేయించిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యాలు..
ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యం తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి కుటుంబాలకు చేర్చడం, బాల కార్మిక వ్యవస్థ నుంచి రక్షించడం, పునరావాసం కల్పించడం. బాలలపై లైంగిక వేధింపులు, అక్రమ రవాణా, కిడ్నాప్‌లను అరికట్టడం, సురక్షిత వాతావరణం కల్పించడం. జిల్లాలో హోటళ్లు, ఇటుక బట్టీలు, వెల్డింగ్ షాపులు, నిర్మాణ పనులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి, వారిని విద్య వైపు నడిపించేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
57 మందికి కొత్త జీవితం..
నెల రోజుల ఆపరేషన్ ముస్కాన్‌లో జిల్లా వ్యాప్తంగా 57 మంది బాలలను గుర్తించారు, వీరిలో 50 మంది బాలురు, ఏడుగురు బాలికలు. నిర్మల్ డివిజన్‌లో 25 మంది, భైంసా సబ్ డివిజన్‌లో 17 మందిపై కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి జరిమానా విధించారు. గుర్తించిన బాలలను తల్లిదండ్రులకు అప్పగించి, కౌన్సెలింగ్ చేశారు. పాఠశాలల్లో చేర్పించారు. ఈ చర్యలు వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి.
ప్రత్యేక పర్యవేక్షణ..
జిల్లా ఎస్పీ ఆపరేషన్ ముస్కాన్‌పై ప్రత్యేక దృష్టి సారించి, కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షించారు. అధికారులు సమన్వయంతో బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు. నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి నాయకత్వం వహించగా, డీసీపీవో మురళి, ఎస్సైలు నరేష్, సందీప్, కానిస్టేబుల్ ప్రశాంత్, ఆరోగ్య, విద్య, కార్మిక శాఖలు, ఎన్‌జీవో సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.
ఆపరేషన్ ముస్కాన్‌లో
పరిష్కరించిన కొన్ని ఘటనలు..
1. తాండ్ర గ్రామంలో 13 ఏళ్ల బాలుడు ఓ షాప్‌లో పనిచేస్తూ కనిపించాడు. ముస్కాన్ బృందం కౌన్సెలింగ్ నిర్వహించి, అతన్ని తిరిగి పాఠశాలలో చేర్పించింది.
2. నవీపేట మండలం, సిర్నాపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు 6వ తరగతి మధ్యలో చదువు మానేసి, నిర్మల్‌లో సోఫా తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని గుర్తించి యజమానిపై కేసు నమోదు చేసి, బాలుడిని సోదరునికి అప్పగించారు.
3. భైంసా పట్టణంలో 13 ఏళ్ల బాలుడు 8వ తరగతి మధ్యలో మానేసి వెల్డింగ్ షాప్‌లో పనిచేస్తుండగా గుర్తించి అతడికి విముక్తి కల్పించారు. బాలుడిని పనిలో పెట్టుకున్న యజమానిపై కేసు నమోదు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
4. లోకేశ్వరం గ్రామంలో 11 ఏళ్ల బాలుడు 5వ తరగతి మధ్యలో ఆపి గొర్రెలు కాస్తుండగా, ముస్కాన్ బృందం అతడిని పాఠశాలలో చేర్పించింది.
5. నిర్మల్ పట్టణంలో ఇద్దరు బాలలు వెల్డింగ్ షాప్‌లో పనిచేస్తూ కనిపించగా, వారిని స్కూల్‌లో చేర్పించి, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
6. భైంసా పట్టణంలో 15 ఏళ్ల బాలుడు నాలుగేళ్ల క్రితం చదువు మానేసి, లైటింగ్ బల్బులు మోస్తుండగా, కౌన్సెలింగ్ ద్వారా తిరిగి పాఠశాలకు పంపారు.
పిల్లలను పనిలో పెట్టుకోవద్దు
బాల కార్మిక వ్యవస్థ ప్రోత్సహిస్తున్న వారిపై కేసు నమోదు చేస్తున్నాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మళ్లీ ఎవరైనా దుకాణాల యజమానులు పిల్లలను పనిలో పెట్టుకుంటే డయల్ 100 లేదా 1098 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. పిల్లలను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. వారికి మంచి భవిష్యత్ కల్పించాలి. ఆపరేషన్ ముస్కాన్‌తో జిల్లాలో బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం.
– జానకీ షర్మిల, ఎస్పీ
ఐదేళ్లలో గుర్తించిన బాల కార్మికులు....
సంవత్సరం ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్
2021 243 85
2022 138 52
2023 67 55
2024 80 69
2025 66 57

బాల కార్మికుల జీవితాల్లో వెలుగు