
భూములు భద్రం.. హక్కులు పదిలం
● రైతులకు భూభారతి శ్రీరామ రక్ష ● ఆగస్టు 15 నాటికి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారం ● కోర్టు కేసులు, సాదా బైనామాల అమలు కోర్టు అనుమతి వస్తేనే.. ● ‘సాక్షి’తో అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. అలాగే రైతులకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. భూములు, హక్కులు భద్రంగా ఉంటాయి’ అని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎల్.కిశోర్‌కుమార్ అన్నారు. ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తీసుకువచ్చిందన్నారు. జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్ల డించారు. భూ భారతి చట్టం అమలు, జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం తదితర వివరాలను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రశ్న: అసైన్డ్ భూమిని వ్యక్తిగత అవసరాలకు విక్రయిస్తే కొన్నవారికి హక్కులు వర్తిస్తా యా? రికార్డులో పేరు మార్చే అవకాశం ఉందా?
అదనపు కలెక్టర్: అసైన్డ్ భూమి పొందిన వ్యక్తి తన భూమిని అమ్ముకోవడానికి ఎటువంటి హక్కులు ఉండవు. ఒకవేళ అసైన్డ్ భూమిని అమ్మితే.. అమ్మిన వ్యక్తికి కొన్న వ్యక్తికి ఇద్దరికీ నోటీసులు అందజేసి హెచ్చరించి మొదటి వ్యక్తికే భూమి చెందుతుంది. ఒకవేళ అదే వ్యక్తి మరోసారి భూమిని అమ్మకానికి పెడితే కొనుగోలు చేసిన వ్యక్తి ఆ భూమిలో కాస్తులో ఉంటూ.. పేద కుటుంబానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు ఆసైన్డ్ కమిటీ సిఫారస్ మేరకు రికార్డులో కొత్తవారి పేరు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారు ఇచ్చే నివేదిక ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
ప్రశ్న: రెవెన్యూ సదస్సుల్లో ఎన్నిరకాల భూసమస్యలపై దరఖాస్తులు అందాయి?
అదనపు కలెక్టర్: సక్సెషన్, మ్యుటేషన్, డీఎస్ పెండింగ్, మిస్సింగ్ సర్వే నంబర్లు, మిస్సింగ్ ల్యాండ్, సాదాబైనామా అమలు, ఆసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వాటిని పెండింగ్‌లో ఉంచి మిగతా దరఖాస్తులు పరిష్కరించే ప్రక్రియ ప్రారంభించాం.
ప్రశ్న: భూ భారతి చట్టంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది?
అదనపు కలెక్టర్:ధరణిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేది కాదు. నేరుగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో రైతులు ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగడం, డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. భూభారతి చట్టంతో ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో మునుపటిలా కోర్టులు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రశ్న: భూభారతి చట్టంపై అమలుపై తహసీల్దార్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా?
అదనపు కలెక్టర్: భూ భారతి చట్టంపై ఇప్పటికే పలు మార్లు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఏదైనా సమస్యలు ఎదురైతే ఎప్పటికప్పుడు వారికి సలహాలు, సూచనలిస్తూ దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
ప్రశ్న: రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం పురోగతి ఎలా ఉంది?
అదనపు కలెక్టర్: జూన్ మొదటి వారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లావ్యాప్తంగా 16,855 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 9,538 పైచిలుకు దరఖాస్తుల పరిష్కారానికి నోటీసులు జారీ, అభ్యంతరాలు స్వీకరించాం. సుమారు 2,600 దరఖాస్తుల పరిష్కారానికి అధికారిక ఆమోదం ఇచ్చాం. ఇప్పటి వరకు 3,888 దరఖాస్తులు తిరస్కరించాం.
ప్రశ్న: ఆక్రమణకు గురైన ప్రభుత్వ, శిఖం భూములను చట్టంతో కాపాడే వీలు ఉందా?
అదనపు కలెక్టర్: ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలు కబ్జా చేసినట్లు అధికారుల దృష్టికి వస్తే వాటిని స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇలాంటి ఘటనలు ఏమైనా ఉంటే ప్రజలు మా దృష్టికి తీసుకురావాలి.
ప్రశ్న: ప్రభుత్వ భూమిని ఏళ్లుగా సాగు చేస్తూ రికార్డులేని వారికి హక్కులు కల్పిస్తారా?
అదనపు కలెక్టర్: ఈ అంశంపై జిల్లాలో కొన్ని దరఖాస్తులు వచ్చాయి. రెండున్నర ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న పేదలకు హక్కు కల్పిస్తాం. అసైన్డ్ కమిటీల నియామకం తర్వాత వారికి కమిటీ సిఫారస్ మేరకు రికార్డు ప్రకారం హక్కు కల్పిస్తాం.
ప్రశ్న: వారసత్వ భూములకు మ్యుటేషన్ ఎలా?
అదనపు కలెక్టర్: జిల్లావ్యాప్తంగా మ్యూటేషన్ కోసం 587 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ స్థాయిలో విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు. ఈ చట్టం ద్వారా నిర్ణీత వ్యవధిలో కాకపోతే ఆటోమెటిక్ మ్యుటేషన్ అయిపోతుంది. ఈ చట్టంలో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి,

భూములు భద్రం.. హక్కులు పదిలం