
సమస్యలు విని.. భరోసా ఇచ్చి..
● ప్రజావాణికి అర్జీల వెల్లువ ● స్వీకరించిన కలెక్టర్ అభిలాష అభినవ్ ● సమస్యలపై సత్వరం స్పందించాలని ఆదేశం
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్య తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ సమస్యపై అధికారులు సత్వరం స్పందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు నియంత్రించేందుకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే మూడుసార్లు జ్వర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. పెంబి మండలానికి జాతీయస్థాయిలోనే ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో కాంస్య పతకం రావడం సంతోషకరమైన విషయమన్నారు. అధికారుల సమష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందన్నారు. గవర్నర్ చేతుల మీదుగా కాంస్య పతకం స్వీకరించినందుకు కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌ను జిల్లా అధికారుల సంఘం తరఫున సన్మానించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అవయవ దానానికి ముందుకు రావాలి..
ప్రజలు పెద్ద ఎత్తున అవయవదానానికి ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖ రిటైర్డ్ ఉద్యోగి జొన్న వినోద్ కుమార్ దంపతులు మరణానంతరం వారి దేహాలను నిర్మల్ వైద్య కళాశాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వారిని అభినందించారు. దేహదానం వైద్య కళాశాల విద్యార్థులకు శిక్షణ, శాసీ్త్రయ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అవయవ దానానికి ముందుకు రావాలన్నారు.
విద్యుత్ స్తంభం తొలగించాలి
ఆదర్శనగర్ కాలనీలో నివాస గృహాలకు మీటరు దూరంలో విద్యుత్ శాఖ అధికారులు 33 కేవీ ఎలకి్ట్రక్ స్తంభం ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం మూడు మీటర్ల దూరం ఉండాలి. అలాగే కాలనీలో సెల్ టవర్ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. వెంటనే అధికారులు అడ్డుకోవాలి. – ఆదర్శనగర్ కాలనీవాసులు

సమస్యలు విని.. భరోసా ఇచ్చి..