
నిర్లక్ష్యంగా వదిలేశారు..!
● రూర్బన్ నిధులు వృథా ● గ్రామీణాభివృద్ధిలో విఫలం ● పట్టించుకోని అధికారులు
లక్ష్యంతో
నిర్మించారు..
కుంటాల: గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్యాం ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్‌ను ప్రారంభించింది. కుంటాల మండలాన్ని 2017 ఆగస్టులో మూడో విడతలో రూర్బన్ మండలంగా ఎంపిక చేసింది. రూ.100 కోట్ల నిధులు కేటాయించింది. అయితే, నిర్వహణ లోపాలు, పర్యవేక్షణ లేకపోవడంతో ఈ నిధులతో చేపట్టిన పనులు వృథాగా మారాయి.
నిర్మించినా నిరుపయోగం..
మండలంలోని గ్రామాల్లో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. స్థానిక మార్కెట్ సౌకర్యాలు లేకపోవడంతో నిర్మల్, భైంసా పట్టణాలకు తరలిస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు కుంటాలలో రూ.43 లక్షలు, విఠాపూర్, లింబా(కె), దౌనెల్లి, కల్లూరు, అంబకంటి గ్రామాల్లో రూ.7 నుంచి రూ.9 లక్షల వరకు వెచ్చించి మార్కెట్ యార్డులు నిర్మించారు. అయినప్పటికీ, ఈ యార్డులు నిరుపయోగంగా మారాయి. కల్లూరు, కుంటాలలో రోడ్లపైనే సంత నిర్వహిస్తున్నారు. మార్కెట్ యార్డులు ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి.
అలంకారప్రాయంగా దాల్ మిల్లులు..
మండలంలోని అంబుగామ, కుంటాల గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో దాల్ మిల్లులను ఏర్పా టు చేశారు. ఈ మిల్లులు స్థానిక రైతులకు ఆదాయ మార్గాన్ని సృష్టించాలన్న లక్ష్యం విఫలమైంది. నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.
నెలకే మూతపడిన మిల్క్ కూలింగ్ పాయింట్..
ఇక కల్లూరు గ్రామంలో తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.40 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఇది కేవలం ఒక నెల మాత్రమే పనిచేసింది. యంత్రాలు చెడిపోవడంతో మూతపడింది. ఆరు నెలలు గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడంతో, స్థానిక పాడి రైతులు పాలను నిర్మల్, భైంసా, దేగాం కేంద్రాలకు తరలిస్తున్నారు.

నిర్లక్ష్యంగా వదిలేశారు..!