
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు లాభాలు
● హార్టికల్చర్ అధికారి మౌనిక
లక్ష్మణచాంద: రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని హార్టికల్చర్ అధికారి మౌనిక తెలిపారు. మండలంలోని వడ్యాల్ రైతు వేదికలో కనకాపూర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వాణిజ్య పంట అయిన ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఆయిల్‌పామ్ రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులుకు డ్రిప్‌లపై 100 శాతం సబ్సిడీ ఉందని, ఇతర రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. మొక్కలు నాటు కోవడానికి ఉపాధిహామీ కూలీలను వినియోగించుకోవచ్చని సూచించారు. ఆయిల్‌పామ్ తోటలో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పంట చేతికి వచ్చే వరకు అంతర పంటలతో పాటు ప్రభుత్వం తరఫున ఎకరానికి ఏటా రూ.4,200 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. నిర్మల్ జిల్లాలోని మాదాపూర్ వద్ద ఫ్యాక్టరీ కూడా నిర్మాణం అవుతుందని తెలిపారు. పంట చేతికి వచ్చిన తర్వాత కంపెనీ వారే రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తారని వెల్లడించారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని సూచించారు. మండలంలోని ప్రతీ క్లస్టర్‌కు 20 ఎకరాల టార్గెట్ ఉందని ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని తెలిపారు. ఇందులో ఏఈవో మౌనిక, రైతులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ గెలల కేంద్రం సందర్శన
ఖానాపూర్: మండలంలోని సత్తనపల్లి గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ఆయిల్‌పామ్ గెలల సమీకరణ కేంద్రాన్ని ఉద్యాన శాఖ అధికారి స్పందన శుక్రవారం సందర్శించారు. ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు గెలల దిగుబడి వస్తే సత్తనపల్లిలోని కేంద్రంలో అందజేయాలన్నారు. గెలలు అందజేసిన వారం రోజుల తర్వాత డబ్బులు సంబంధిత రైతుల ఖాతాలో జమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏరియా మేనేజర్ వనోజ్, క్లస్టర్ అధికారి దినేశ్ పాల్గొన్నారు.