
బాల్యంపై పుస్తకాల భారం
● వయసును మించిన బరువు ● మోయలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ● ప్రభుత్వ నిబంధనలకు ‘ప్రైవేటు’ పాతర
లక్ష్మణచాంద: బాల్యం అంటేనే సుకుమారం. చిన్న పిల్లలతో పనులు చేయించొద్దని, బాలల హక్కులను కాపాడాలని నిబంధనలు ఉన్నాయి. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు పని పిల్లలకన్నా.. ఎక్కువ బరువు పిల్లల వెన్నెపూసపై వేస్తున్నాయి. ఇష్టానుసారం పుస్తకాలు కొనుగోలు చేయిస్తూ ఆర్థికంగా దోపిడీ చేయడమే కాకుండా.. పిల్లలపై వయసును మించిన భారం మోపుతున్నాయి. పుస్తకాల సంచి పేరుతో బస్తాలను మోసినట్లు మోయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఈఆర్‌టీ ద్వారా పాఠ్యపుస్తకాల బరువుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, 2017లో తెలంగాణ ప్రభుత్వం జీవో 22 ద్వారా ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించినా, అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ పాఠశాలలు ఈ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. పోటీపడి మరీ పుస్తకాల సంఖ్యను పెంచుతూ బాల్యంపై భారాన్ని మోపుతున్నాయి.
ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలు ఇవీ..
ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాల ప్రకారం, 1వ, 2వ తరగతి విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువు 1–3 కిలోలు, 3వ నుంచి 5వ తరగతి వరకు 2–3 కిలోలు, 6, 7వ తరగతులకు 4 కిలోలు, 8వ తరగతికి 4–5 కిలోలు, 9, 10వ తరగతులకు 5 కిలోల బరువు మాత్రమే ఉండాలి. ఈ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం 2017లో జీవో కూడా జారీ చేసింది. కానీ జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ ఈ నియమాలు పాటించడంలేదు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ, పాఠశాలలు అనవసరమైన పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నాయి.
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి
నిర్మల్ జిల్లాలో 205 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వీటిలో 73,571 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 14 ప్రాథమిక పాఠశాలల్లో 2,417 మంది, 115 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 25,766 మంది, 76 ఉన్నత పాఠశాలల్లో 45,388 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలు నిబంధనలను పాటించకుండా, విద్యార్థులపై అధిక బరువును మోపుతూ, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయి. పాఠశాలలు అందించే అనవసరమైన పుస్తకాలు విద్యార్థుల బ్యాగ్ బరువును పెంచడమే కాక, తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని కూడా భారీగా మార్చాయి.
పరిష్కారం కోసం తల్లిదండ్రుల డిమాండ్
విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పాఠశాలలు నిబంధనలను ఉల్లంఘించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు, కొన్ని పుస్తకాలను పాఠశాలలోనే భద్రపరచడం, డిజిటల్ లెర్నింగ్‌ను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. అధిక బరువును తగ్గించడం ద్వారా విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు, తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చని వారు వాదిస్తున్నారు.
జేఈఈ, నీట్ పేరుతో దోపిడీ
ప్రైవేట్ పాఠశాలలు జేఈఈ, నీట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల సన్నద్ధత పేరుతో ప్రాథమికస్థాయి నుండే విద్యార్థులకు అధిక సిలబస్‌ను బోధిస్తున్నాయి. వారి శక్తిని మించిన చదువులు చెబుతున్నాయి. ఈ సాకుతో తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ, విద్యార్థులకు మోయలేనంత పుస్తకాల బరువును అంటగడుతున్నాయి. జిల్లాలో 1వ నుండి 5వ తరగతి విద్యార్థులు 6–12 కిలోలు, 6వ నుంచి 10వ తరగతి విద్యార్థులు 17–20 కిలోల బరువును మోస్తున్నారు. ఈ అధిక బరువు విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
నిబంధనల ప్రకారం బడి సంచి బరువు తరగతుల వారీగా..
తరగతి బరువు
1, 2 1–3 కేజీలు
3, 5వ 2–3 కేజీలు
6, 7వ 4 కేజీలు
8వ 4–5 కేజీలు
9, 10వ 5 కేజీలు

బాల్యంపై పుస్తకాల భారం