
మీసేవలు సులభతరం
● అదనపు సేవలకు అవకాశం ● వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ల జారీ ● వినియోగదారులకు మరింత సౌలభ్యం
నిర్మల్‌ఖిల్లా: రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకు శ్రీకారం చుట్టింది. అదనపు సేవలు వినియోగదారులకు సులభతరం చేసేందుకు అవకాశం కల్పించింది. ఇకపై వివాహ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీకి నిర్ణయించింది. ఇందులో భాగంగా సంబంధిత స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రారంభించింది. వివాహ ధ్రువపత్రం కోసం దరఖాస్తుకు ఇరువురు దంపతుల ఆధార్‌కార్డులు వయస్సు పుట్టిన తేదీ, కుల, ఆదాయం ధ్రువపత్రాలు, పదో తరగతి సర్టిఫికెట్‌తోపాటు పెళ్లిఫొటోలు, ఆహ్వానపత్రం జతపర్చాల్సి ఉంటుంది. పెళ్లి చేసుకున్న ప్రాంతం, చిరునామా, వివాహ తేదీ భార్యాభర్తల వ్యక్తిగత వివరాలు, చిరునామా, వృత్తి, కులం, మతం తదితర అంశాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల తల్లిదండ్రుల పేర్లు, సాక్షిల వివరాలు వంటివి అందజేయాలి. న్యాయవాది వద్ద తీసుకున్న నోటరీతోపాటు వివాహం జరిగిన ప్రాంతం ఫంక్షన్‌హాల్ లేదా ఆలయం ద్వారా ధ్రువపత్రాలు సమర్పించాలి. వీటన్నింటిని మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత తగిన సమయం ప్రకారం స్లాట్‌బుక్ చేసుకుని ఆ తేదీ రోజున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు సాక్షులతోపాటు నవ దంపతులు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తులను సబ్ రిజిస్ట్రార్ విచారణ అనంతరం వివాహ ధ్రువపత్రాన్ని జారీచేస్తారు.
మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్..
ఇంటి స్థలం వైశాల్యం, అపార్ట్‌మెంట్, స్థిరాస్తి ఉన్న ప్రాంతం ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువ నిర్ధారించుకోవడానికి మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు పరిశీలన అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఆస్తికి సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువ ధ్రువపత్రాన్ని జారీచేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారుడు ఆధార్‌కార్డు్, ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ స్థలం డాక్యుమెంట్లు, ప న్నులు కట్టిన రసీదు గ్రామం, మండలం, జిల్లా వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. తగిన పరి శీలన అనంతరం ధ్రువీకరణపత్రాన్ని జారీచేస్తారు.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 401 మీసేవ కేంద్రాలు వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. 2011లో 10 రకాల సేవలతో ప్రారంభమైన ఈ కేంద్రాలు ప్రస్తుతం 40 శాఖలకు చెందిన 350 రకాల సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మరో రెండు రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో మీ సేవ కేంద్రాలు
ఆదిలాబాద్ 80 నిర్మల్ 113
మంచిర్యాల 139 కుమురంభీం 69