
ర్యాంకు మెరుగయ్యేనా?
లక్ష్మణచాంద: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, స్వచ్ఛతను పెంపొందించే లక్ష్యంతో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు, వ్యర్థాల నిర్వహణ, పౌరుల అవగాహనను క్షేత్రస్థాయిలో పరిశీలించి, జాతీయస్థాయి ర్యాంకులను కేటాయిస్తారు. జిల్లాలో ఈ సర్వే కోసం కేంద్ర బృందం ఇప్పటికే పర్యటన ప్రారంభించి, నాలుగు కీలక అంశాల ఆధారంగా మూల్యాంకనం స్తున్నాయి. ఈ సర్వేలో నాలుగు కీలక అంశాల ఆధారంగా 1000 మార్కులతో గ్రామాలను మూల్యాంకనం చేస్తారు.
పారిశుద్ధ్య కమిటీలు ఏర్పాటు..
సర్వేలో మొదటి అంశం సేవాస్థాయి పురోగతి. దీనికి 240 మార్కులు కేటాయిస్తారు. ఈ విభాగంలో గ్రామాలు ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ(ఓడీఎఫ్) ప్లస్ ధ్రువీకరణ పత్రం, గ్రామ సభ తీర్మానం, ఆన్‌లైన్ డేటా నమోదు వంటి అంశాలను పూర్తి చేయాలి. అదనంగా, స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ కోసం ప్రత్యేక సిబ్బంది నియామకం, పారిశుద్ధ్య, తాగునీటి కమిటీల ఏర్పాటు తప్పనిసరి. జిల్లాలో ఈ అంశాలపై గ్రామ పంచాయతీలు చురుకుగా పనిచేస్తున్నాయి.
మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభత్ర..
సర్వేలో అత్యధిక వెయిటేజీ (540 మార్కులు) కలిగిన అంశం క్షేత్రస్థాయి పరిశీలన. ఈ విభా గంలో కేంద్ర బృందం గ్రామాల్లో మరుగుదొడ్ల లభ్యత, వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, పౌరులలో స్వచ్ఛతపై అవగాహనను పరి శీలిస్తుంది. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, శుభ్రతా సౌకర్యాలు ఈ మూల్యాంకనంలో కీలకం. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని సృష్టించడంలో దోహదపడుతుంది.
పర్యావరణ పరిరక్షణ..
వ్యర్థాల నిర్వహణకు 120 మార్కులు కేటాయించారు. ఈ విభాగంలో గ్రామాల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, వాటి సమర్థవంతమైన నిర్వహణను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామాల్లో వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డిస్పోజల్ విధానాలను కేంద్ర బృందం పరిశీలిస్తోంది. వ్యర్థాల నిర్వహణ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్లాస్టిక్ కాలుష్యం తగ్గడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రీసైక్లింగ్ ద్వారా ఆదాయం లభిస్తుంది.
ఉత్తమ ర్యాంకు కోసం..
జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 కోసం కేంద్ర బృందం ఇప్పటికే పర్యటన ప్రారంభించి, నాలుగు అంశాలపై క్షేత్రస్థాయి మూల్యాంకనం చేస్తోంది. 2022లో జిల్లా జాతీయస్థాయిలో 10 లోపు ర్యాంకు సాధించింది. ఈ సంవత్సరం మరింత మెరుగైన ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. డీఆర్డీఏ అధికారులు కేంద్ర బృందం రిపోర్ట్‌ను త్వరలో సమర్పించనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, స్థానిక నాయకులు, పౌరుల సహకారంతో నిర్మల్ జిల్లా ఈ సర్వేలో ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశం ఉంది.
ప్రారంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ సర్వే
పలు అంశాలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం
సిటిజన్ ఫీడ్‌బ్యాక్..
సర్వేలో చివరి అంశం ప్రజాభిప్రాయ సేకరణ, దీనికి 100 మార్కులు కేటాయించారు. ఇంటింటా చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, మరుగుదొడ్ల లభ్యత, వినియోగంపై పౌరుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియ కోసం పౌరులు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ యాప్ ద్వారా 13 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. జిల్లా గ్రామాల్లో ఈ యాప్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతోంది.
ప్రజల భాగస్వామ్యం కీలకం..
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకు రావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ సారి మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ప్రజలు సిటిజన్ ఫీడ్ బ్యాక్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అబిప్రాయాలు నమోదు చేయాలి.
– నాగవర్ధఽన్, ఇన్‌చార్జి డీఆర్డీవో నిర్మల్

ర్యాంకు మెరుగయ్యేనా?

ర్యాంకు మెరుగయ్యేనా?