భూభారతిపై ఆశలు
● నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు.. ● ధరణిలో పూర్తి వివరాలు లేక ఇబ్బందులు ● పెండింగ్‌లోనే వందల అర్జీలు ● కొత్త చట్టంతో పరిష్కారం అయ్యేనా?
ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతుపేరు కొకినోల్ల రుక్మాబాయి. భైంసా మండలం ఇలేగాం శివారులో 203/క సర్వే నంబరులో రెండు ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వం 645936 నంబరుతో ముద్రించిన 351 క్రమ సంఖ్య ఆధారంగా పట్టాపాసుపుస్తకం జారీ చేసింది. 010435 యూనిక్ ఐడీ నంబరు కేటాయించి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదుచేసింది. తర్వాత రెవెన్యూ సర్వే నిర్వహించి పట్టాపాసుపుస్తకంపై అన్ని సరిగ్గా ఉన్నాయని ముద్రించింది. ఆన్‌లైన్‌లో పహణీ తీసుకుని భైంసాలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆరేళ్ల క్రితమే పంటరుణం తీసుకుంది. మరుసటి ఏడాది ధరణిలో కొత్త పట్టాపాసుపుస్తకం ఇవ్వలేదు. ఆన్‌లైన్‌లో మహిళా రైతు వివరాలు నమోదుచేయలేదు. దీంతో ఆన్‌లైన్‌లో గతంలో ఉన్న వివరాలన్ని కనిపించకుండాపోయాయి. కొత్త పహణీ రాకపోవడంతో రుణం రీషెడ్యూల్ కావడంలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇప్పటీ పట్టాపాసుపుస్తకం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన సాయం కూడా అందడంలేదు. రుణ మాఫీకి అర్హత ఉన్నా.. కాలేదు.
భైంసా: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో జిల్లాలో భూ సమస్యలు పెరిగాయి. ఒకరి భూమి మరొకరి పేరిట నమోదైంది. ఉన్న భూమి మాయమైంది. కొందరికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చినా ఆన్‌లైన్‌లో భూమి చూపించడం లేదు. ఇలా అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులుపడుతూనే ఉన్నారు. పాసుపుస్తకంలో భూమి ఉన్న పొజీషి యన్‌లో లేక పోవడం, వారసత్వంగా రావాల్సిన పౌతి కోసం ధరణిలో ఆప్షన్ లేకపోవడం రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రతిసారి జిల్లా రైతులు తమ ఇబ్బందులను అధికారులకు చెబుతునే ఉన్నారు.
వెంటాడుతున్న ఇబ్బందులు...
జిల్లా రైతులను ధరణి సమస్యలు వెంటాడుతున్నా యి. జిల్లాలో సాదాబైనామాల ద్వారా భూములు కొని క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఇచ్చారు. కొందరి దగ్గర రశీదులు ఉన్నాయి. మరికొందరి దగ్గర లేవు. దరఖాస్తులు ఇచ్చిన వారిలో చాలా వరకు క్రమబద్ధీకరణజరుగలేదు. పట్టాభూములై ఉండి కూడా నిషేధిత జాబితాలో వివరాలు చేర్చారు. చాలా మంది రైతుల పట్టాపాసుపుస్తకాల్లో భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు రావడం, ఒకరి విస్తీర్ణం మరో రైతు పేరున చేర్చడం వంటి సమస్యలు ఉన్నాయి. గ్రామాల్లో ఎటుచూసినా హద్దుల సమస్య ప్రధానంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పంటపొలాలకు వెళ్లేదారులు, జరినాలాలు, మూసి వేసిన రైతులకు అక్రమంగా పట్టాలు జారీచేశారు. జరినాలాలు మూసుకుపోవడంతో వర్షాకాలంలో రైతుల పంటపొలాలు జలమయమవుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా జరినాలాల భూముల వివరాలు ఎక్కడ కూడా నమోదుచేయడంలేదు.
కొత్త చట్టంపై ఆశలు..
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి అమలు కానుంది. ఇప్పటికే కుంటాల మండలం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని రైతుల వద్దకే అధికారులు వస్తారని అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లోనూ మంగళవారం నుంచి భూ భారతి అమలు కానుంది. ప్రతీ మండలంలో ప్రత్యేక బృందాలు గ్రామాలకు వెళ్లి భూ భారతి సదస్సు నిర్వహించి రైతుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఈలోగా జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్‌లలో రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని మండల రెవెన్యూ అధికారులను జిల్లా రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పరిష్కారంకాని సమస్యల అర్జీలు ఇచ్చేందుకు బాధిత రైతులు ఎదురుచూస్తున్నారు.
భూభారతిపై ఆశలు


