
అవగాహనతో మోసాలకు చెక్
● 25 వరకు అంతర్జాతీయ తూనికల వారోత్సవాలు ● జిల్లాలో కనిపించని కార్యక్రమాలు ● రెగ్యులర్ అధికారిగా శంకర్ నియామకం
భైంసాటౌన్: అంతర్జాతీయ తూనికలు, కొలతల ది నోత్సవం (మే 20) సందర్భంగా లీగల్ మెట్రాలజీ శాఖ వారోత్సవ కార్యక్రమాలను(మే 25 వరకు) నిర్వహించాలని నిర్ణయించింది. వినియోగదారులను తూకాల్లో మోసాలపై చైతన్యపరచడం, కచ్చితమైన కొలతలను నిర్ధారించడం ఈ కార్యక్రమాల లక్ష్యం. అయితే, జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తూకాల్లో మోసాలు..
జిల్లావ్యాప్తంగా వ్యాపారులు కూరగాయలు, బియ్యం, మాంసం, పెట్రోల్ వంటి వస్తువుల తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. రైతులు కూడా పంట విక్రయంలో మోసపోతున్నారు. ఎలక్ట్రానిక్, మాన్యువల్ కాంటాలు, వేబ్రిడ్జిలు, పెట్రోల్ పంపులలో తనిఖీలు సక్రమంగా జరగకపోవడం ఈ సమస్యలకు కారణం. దీంతో నిత్యం వినియోగదారులు మోససోతూనే ఉన్నారు. నివారణకు తూనికలు, కొలతల శాఖ పర్యవేక్షణ చేపట్టాలి. తరచూ ఎలక్ట్రానిక్ కాంటాలు, మ్యానువల్ కాంటా బాట్లు, వేబ్రిడ్జిలు, ప్యాకింగ్ వస్తువులు, పెట్రోల్‌పంపులు తనిఖీ చేయాల్సి ఉంటుంది.
ఇన్‌చార్జి అధికారుల కొరత
జిల్లాకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఇన్‌చార్జి అధికారులు పనిభారంతో పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారు. దీంతో మోసాలు అరికట్టడం సాధ్యం కాలేదు. ‘సాక్షి’ కథనాల ఒత్తిడితో ఇటీవల రెగ్యులర్ అధికారిని నియమించారు. ఇకనైనా, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, వినియోగదారులకు కచ్చితమైన వస్తు సేవలు అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.