
వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చర్యలు
● ఎస్పీ జానకీషర్మిల
నిర్మల్‌టౌన్: రానున్న వర్షాకాలంలో జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. వర్షాలతో ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సాయుధ దళ కార్యాలయంలో గురువారం ఫ్లడ్ రిలీఫ్ కోసం ఏర్పాటు చేసిన సామగ్రిని పరిశీలించారు. జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులు పూర్తిగా నిండనున్న దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు చేపడుతామన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్, రోప్ వస్తువులు వాడకంపై పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు రాంనిరంజన్, రమేశ్, ఆర్‌ఎస్సైలు రవికుమార్, రాజశేఖర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.