● బంగల్‌చెరువు, మొసళ్లపార్కుపై అభివృద్ధి కోసం.. ● టూరిజం మంత్రి, చైర్మన్ దృష్టికి.. ● వినతిపత్రాలు ఇచ్చిన గ్రంథాలయ చైర్మన్ ● సంబంధిత అధికారులతో కలెక్టర్ భేటీ ● అవశ్యకతపై ‘సాక్షి’ వరుస కథనాలు
నిర్మల్: ప్రశ్నార్థకంగా మారిన జిల్లా పర్యాటక అభివృద్ధిపై ‘సాక్షి’ వరుస కథనాలతో కొంత కదలిక కని పిస్తోంది. జిల్లా కేంద్రంలోని బంగల్‌చెరువు(వినా యకసాగర్), సోన్ మండలంలోని మొసళ్ల మ డుగును టూరిజం స్పాట్‌లుగా అభివృద్ధి చేయాల న్న డిమాండ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కా ర్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. గతనెలలో కార్పొరేషన్ చైర్మన్ స్వయంగా ఈ రెండు ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. తాజాగా ఈ ప్రాంతాల పరిస్థితి, అభివృద్ధి పనులు, సంబంధిత భూముల విషయంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమావేశం కావడం పర్యాటక అభివృద్ధిపై ఆశలు బలపరుస్తున్నాయి.
మంత్రిని కలిసిన గ్రంథాలయ చైర్మన్..
జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నా.. కనీసం పట్టించుకునేవారు లేరన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇదే విషయంపై తరచూ ‘సాక్షి’ కథనాలనూ ప్రచురిస్తోంది. ఈక్రమంలోనే ఇటీవల జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ టూరిజం డెవలప్‌మెంట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. గతనెల 20న పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డిని జిల్లాకు రప్పించారు. ఇక్కడి ప్రాంతాలను చూపించారు. మళ్లీ ఈనెల 7న హైదరాబాద్ వెళ్లి చైర్మన్‌ను కలిసి అభివృద్ధి కోసం పనులు చేపట్టాలని గుర్తుచేశారు. అదేరోజు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ద్వారా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు లేఖ రాయించారు. తాజాగా శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి జూపల్లిని స్వయంగా కలిసి జిల్లాలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
అధికారులతో కలెక్టర్ భేటీ..
జిల్లాలో పర్యాటక అభివృద్ధికి జిల్లా అధికారులూ చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పారెస్పీ, అటవీశాఖ, రెవెన్యూ అ ధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు.సోన్ మండలం పాక్‌పట్ల దగ్గర ఉన్న మొసళ్ల మడుగు అభివృద్ధిపై చర్చించారు. అక్కడ ఉన్న భూమి, చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది. నిర్మల్ ఉత్సవాల పేరిట మూడురోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్ అప్పటి నుంచే టూరిజంపైనా దృష్టిపెట్టారు. ఇప్పటికే పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు.
పుష్కలంగా అవకాశాలు..
జిల్లాలో పర్యాటక అభివృద్ధి డిమాండ్ దశాబ్ద కా లంగా ఉంది. కానీ.. ఈ దిశగా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే పాలకులు, అధికారులు లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. ఇటు సోన్ వంతెన, గోదావరి మొదలుకుని మహబూబ్‌ఘాట్ వరకు, అటు బాస ర నుంచి కడెం దాకా ఎన్నో ఉన్నాయి. ‘సాక్షి’ కొంతకాలంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అవశ్యకతపై తరచూ కథనాలను ప్రచురిస్తోంది.
ప్రస్తుతానికి ఈ రెండింటిపైనే..
నిర్మల్ కేంద్రంగా టూరిజం సర్క్యూట్ చేస్తామంటూ గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతలయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం నుంచి భారీగా నిధులు ఆశించే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలోనే ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలోని బంగల్‌చెరువు, పాక్‌పట్ల వద్ద మొసళ్ల(క్రోకోడైల్) పార్కును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఓవైపు కలెక్టర్, మరోవైపు అధికార పార్టీకి చెందిన గ్రంథాలయసంస్థ చైర్మన్ పర్యాటకాభివృద్ధికి ప్రయత్నిస్తుండటంతో ఈసారి ఎంతోకొంత మార్పు వస్తుందని జిల్లావాసులు ఆశిస్తున్నారు.
పర్యాటకాభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం..
జిల్లాలో పర్యాటకంగా చాలాప్రాంతాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. పాక్‌పట్ల దగ్గర క్రోకోడైల్ పార్క్ కోసం అటవీశాఖ ద్వారా చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా ప్రతిపాదనలకు సంబంధించి టూరిజం శాఖ నుంచి అధికారులు జిల్లాకు రావాల్సి ఉంది.
– అభిలాష అభినవ్, కలెక్టర్
‘పర్యాటకం’పై కదలిక..!
‘పర్యాటకం’పై కదలిక..!
‘పర్యాటకం’పై కదలిక..!