
రైతులకు దొంగల బెడద
కుంటాల: మండల శివారులోని రైతుల పంట పొలాల వద్ద ఉన్న బోరుబావి స్టార్టర్లు, విద్యుత్ మోటార్ల చోరీలు ఆగడం లేదు. వరుస దొంగతనాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది నుంచి ఈ దొంగతనాలు కొనసాగుతున్నప్పటికీ, అధికారులు, పోలీసుల నుంచి చర్యలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో చివరి నీటి తడుల కోసం రైతులు బోర్లు, బావులపైనే ఆధారపడతారు. దొంగలు ఇదే అదనుగా చోరీలకు పాల్పడుతున్నారు. సునాయాసంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు స్థానికులే చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
దొంగతనాలతో ఆర్థిక, భద్రతా సమస్యలు
మండల శివారులో ఏడాదిగా సుమారు 30 రైతులకు చెందిన స్టార్టర్లు చోరీ అయ్యాయి. ఒక్కో స్టార్టర్ ధర రూ.2 వేల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. దొంగలు అర్ధరాత్రి సమయంలో విద్యుత్ తీగలను కత్తిరించి స్టార్టర్లను ఎత్తుకెళ్తున్నారు. ఈ ప్రక్రియలో కత్తిరించిన తీగలకు విద్యుత్ సరఫరా కొనసాగడంతో రైతులు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల ఒకే రోజు ఐదు స్టార్టర్లు చోరీ అయ్యాయి. పంచాయతీ నర్సరీకి చెందిన సింగిల్ ఫేజ్ మోటార్, ఆరు స్టార్టర్ల దొంగతనంతో రూ.25 వేల నష్టం వాటిల్లిందని పంచాయతీ కార్యదర్శి రాజబాపు తెలిపారు.
కఠిన చర్యలకు రైతుల డిమాండ్..
రైతులు వ్యయప్రయాసలకు ఓర్చి పంటలు సాగు చేస్తుండగా, ఈ దొంగతనాలు ఆర్థిక భారంగా మారుతున్నాయి. రాత్రిపూట పొలాల వద్ద లేని సమయాన్ని దొంగలు ఉపయోగించుకుంటున్నారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదు. అధికారులు తక్షణం స్పందించి దొంగలను పట్టుకొని, న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
స్టార్టర్లు, మోటార్లు ఎత్తుకెళ్తున్నవైనం..
వరుస ఘటనలతో అన్నదాత ఆందోళన
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగని చోరీలు
పొట్టపెల్లిలో మూడు విద్యుత్ మోటార్ల చోరీ
లక్ష్మణచాంద: మండలంలోని పొట్టపెల్లి(కె) గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు విద్యుత్ మోటార్లు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతులు చించోలి సాయన్న, పోతుగంటి శ్రీధర్, పీచర గ్రామానికి చెందిన బెడద నరేశ్ పొట్టపెల్లి గ్రామ సమీపంలోని డీ–16 కాలువ వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని పంటలకు మళ్లిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు రైతులకు చెందిన మోటార్లను, విద్యుత్ కేబుల్‌తో సహా ఎత్తుకెళ్లారు. శుక్రవారం పొలాల వద్దకు వెళ్లిన రైతులు గమనించి బాధిత రైతులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు వెళ్లిన రైతులు మోటార్లను చూసి ఆవేదన చెందారు. మళ్లీ కొనుగోలు చేయాలంటే రూ.25 వేలు అవుతుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్సై సుప్రియ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రైతులకు దొంగల బెడద

రైతులకు దొంగల బెడద