
ఐస్.. అయితే రోగాలు ఫ్రీ!
● చల్లని, తీయని జ్యూస్‌లపై అప్రమత్తత తప్పనిసరి ● ఐస్ ముక్కలు, రసాయన రంగులతో అనారోగ్యం ● జాగ్రత్త వహించాలంటున్న వైద్య నిపుణులు..
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ ఎండల నుంచి ఉపశమనం కోసం జ్యూస్ సెంటర్లలో పండ్ల రసాలు, శీతల పానీయాలు తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చినవారు కూడా చల్లని జ్యూస్‌లతో రిలాక్స్ అవుతున్నారు. అయితే, ఈ జ్యూస్‌ల తయారీలో కృత్రిమ రంగులు, మలిన ఐస్, పాడైన పండ్ల వినియోగం ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అడుగడుగునా జ్యూస్ సెంటర్లు...
జిల్లాలో పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ ఇబ్బడి ముబ్బడిగా జ్యూస్ సెంటర్లు వెలిశాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో అనేకమంది జ్యూస్‌లు తా గుతూ వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. వివిధ రకాల పండ్ల రసాలు తయారు చేస్తూ జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు ఉపాధి పొందుతున్నారు.
కృత్రిమ రుచులు, రంగులు..
జ్యూస్ సెంటర్లలో ఆకర్షణ కోసం బాదం, పిస్తా వంటి కృత్రిమ ఫ్లేవర్ పౌడర్లు, కెమికల్ రంగులు విని యోగిస్తున్నారు. మలిన నీటితో తయారైన ఐస్ హానికర బ్యాక్టీరియాను కలిగిస్తాయి. నిల్వ చేసిన పండ్లలో ఫంగస్, ఈకోలి బ్యాక్టీరియా ఏర్పడి వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి సమస్యలకు దారితీస్తాయి. రోడ్డు పక్కన స్టాల్స్‌లో దుమ్ము, ధూళి కలిసే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లలో జ్యూస్ తీసుకెళ్లడం కూడా ఆరోగ్యానికి హానికరం.
ఆరోగ్య రక్షణకు సూచనలు
వైద్య నిపుణులు తాజా పండ్లతో ఇంట్లో జ్యూస్ తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. స్టాల్స్‌లో శుభ్రత, పండ్ల నాణ్యతను తనిఖీ చేయాలి. క్రిమిసంహారకాలతో పక్వానికి తెచ్చిన పండ్లు క్యాన్సర్ కారకాలను కలిగిస్తాయి. జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, దంత సమస్యలను నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్రమత్తత తప్పనిసరి...
వేసవికాలంలో సహజంగానే చాలామంది శీతల పానీయాలు సేవించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే పండ్ల రసాలు జ్యూస్ సెంటర్లలో తాగేముందు అక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉందా లేదా చూసుకోవాలి. జ్యూస్ తయారీలో ఎటువంటి పండ్లు వినియోగిస్తున్నారు, కెమికల్స్ వాడుతున్నారా.. అనేది గమనించాలి. తాజా పండ్లు మాత్రమే పోషకాలను ఇస్తాయి. చిన్న పిల్లలకు జ్యూస్‌లు బయట తాగించొద్దు. ఇంట్లో తయారు చేసుకుని సేవించడం మంచిది.
– డాక్టర్ శశికాంత్, జనరల్ సర్జన్, నిర్మల్
దుష్ప్రభావాలివీ..
పండ్ల రసాల తయారీలో కలుషిత పదార్థాలు చేరడం, మురిగిపోయిన పండ్లను వినియోగించడం వలన హెపటైటిస్ బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పచ్చకామెర్లు వస్తాయి..
నిల్వ ఉంచిన పండ్లలో ఈకోలి బ్యాక్టీరి యా తయారవుతుంది. వాటిని సేవించిన వ్యక్తులు వాంతులు విరోచనాలతోపాటు టైఫాయిడ్ బారిన పడే ప్రమాదం ఉంది.
నిల్వ ఉంచిన జ్యూస్ తాగడం వల్ల నులిపురుగుల సంక్రమణతోపాటు చిన్న పిల్లల్లో గొంతు నొప్పి వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు సోకుతాయి. దంత సమస్యలు తలెత్తుతాయి.
కృత్రిమ రంగులు, అపరిశుభ్రమైన ఐస్‌తో తయారు చేసిన జ్యూస్‌తో జీర్ణవ్యవస్థకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. క్రిమిసంహారక మందులతో పక్వానికి తెచ్చిన పండ్లను వినియోగించడం ద్వారా కూడా క్యాన్సర్ కారకాలు శరీరానికి చేరుతాయి.

ఐస్.. అయితే రోగాలు ఫ్రీ!

ఐస్.. అయితే రోగాలు ఫ్రీ!