
లక్ష్యం ఘనం ... నిర్వహణ శూన్యం
● జిల్లాలో నిరుపయోగంగా నీటి తొట్టెలు.. ● నాసిరకంగా నిర్మాణం ● కొన్నింటికి లీకేజీలు ,,మరికొన్నింటికి బీటలు ● పశువుల దాహార్తి తీర్చని వైనం..
తానూరు: వేసవి కాలంలో నీటి ఎద్దడితో పశువులు అల్లాడుతున్న నిర్మల్ జిల్లాలో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.74.41 లక్షలతో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. చాలా తొట్టెల్లో నీరు లేక, పశువులు చెరువులు, కుంటలపై ఆధారపడుతున్నాయి.
నీటి తొట్టెల నిర్మాణం..
2010 నుంచి 2018 వరకు నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీల్లో 953 నీటి తొట్టెలు నిర్మించారు, ఒక్కో తొట్టికి రూ.22,190 ఖర్చు చేశారు. మొత్తం రూ.74,41,488 లక్షల వరకు ఖర్చు చేశారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు బోరుబావుల సమీపంలో నిర్మించిన ఈ తొట్టెలు, ప్రస్తుతం నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. సగానికి పైగా తొట్టెలు నాసిరక నిర్మాణం, నీటి వసతి లేని ప్రాంతాల్లో నిర్మాణం వల్ల వృథాగా మారాయి.
నిర్వహణ లోపాలు
చాలా తొట్టెలు బోరు మోటార్లు చెడిపోవడం, పైప్‌లైన్ మరమ్మతులు లేకపోవడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం వంటి కారణాలతో పనిచేయడం లేదు. కొన్ని తొట్టెలు పగుళ్లు, లీకేజీలతో నిరుప యోగంగా ఉన్నాయి. తానూరు మండలంలోని మహాలింగి, తొండాల, నంద్‌గాం వంటి గ్రామాల్లో గ్రామానికి దూరంగా నిర్మించిన తొట్టిలకు నీటి సరఫరా లేక, ఉపయోగం లేదు. కొన్ని గ్రామాల్లో సర్పంచులు కాంట్రాక్టర్‌లుగా మారి తూతూమంత్రగా నిర్మించడంతో తొట్టెలకు పగుళ్లు రావడం, కొన్ని చోట్ల పక్కకు పడిపోవడం, నీళ్లు లీకేజీ ఏర్పడటం లాంటివి ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అవసరం లేని ప్రాంతాల్లో కూడా నీటి తొట్టెలు నిర్మించడంతో వాటికి నీటి సౌకర్యం లేక వృథాగా పడి ఉన్నాయి.
రైతుల ఆవేదన
అధికారుల నిర్లక్ష్యంతో ప్రజాధనం వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో, పశువులు దాహంతో అల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడం వల్ల బోర్లు కూడా పనిచేయడం లేదు. డ్వామా, పశుసంవర్ధక, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు మరమ్మతులు చేపట్టి, బోరు మోటార్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మిషన్ భగీరథ నీటిని తొట్టెలకు సరఫరా చేస్తే, వేసవిలో పశువుల దాహార్తి తీరుతుందని రైతులు సూచిస్తున్నారు. సింగిల్ ఫేజ్ మోటార్ల ద్వారా గ్రామ చివరి తొట్టెలకు నీటిని అందించడం కూడా సాధ్యమే.
వివరాలు...
జిల్లాలోని గ్రామాలు 682
పంచాయతీలు 396
నీటితొట్టెలు 953
చేసిన ఖర్చు రూ.74,41,488
పనిదినాలు 17,362 రోజులు
ఉపయోగంలోకి తేవాలి
సరఫరా లేక పశువుల నీటి తొట్లెలు నిరుపయోగంగా మారుతున్నాయి. పశువుల దాహార్తి తీరడం లేదు. వేసవి నేపథ్యంలో చెరువులు ఎండిపోయాయి. పశువులకు నీరు దొరకడం లేదు. అధికారులు స్పందించి తొట్టెలకు నీటి సరఫరా చేసి వినియోగంలోకి తీసుకురావాలి.
– గంగాధర్, బోరిగాం గ్రామం
నీటి సౌకర్యం కల్పిస్తాం..
ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మించిన తొట్టెల నిర్వహణను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు చూసుకోవాలి. ఆయా గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టెల వివరాలను తెలుసుకుని సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు సమావేశం నిర్వహించి మిషన భగీరథ నీటి సౌకర్యం కల్పించి ఉపయోగంలో తీసుకువస్తాం. – నాగవర్ధన్, డీఎల్పీవో

లక్ష్యం ఘనం ... నిర్వహణ శూన్యం

లక్ష్యం ఘనం ... నిర్వహణ శూన్యం