
గుండెపోటా..వైద్యులు లేరు!
● నిర్మల్ ఆస్పత్రిలో నిరుపయోగంగా 2డీ ఎకో ● కార్డియాలజిస్టు లేక ఇబ్బంది ● జనరల్ ఫిజిషియన్‌తో వైద్యం ● ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ ● అన్ని పరీక్షలు అందుబాటులోకి తేవాలంటున్న ప్రజలు
పోస్టులు భర్తీ చేయాలి
నిర్మల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్టులు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుండగా ఇబ్బందులు పడుతున్నారు. కార్డియాలజిస్టు పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తేవాలి.
– కోరిపెల్లి శ్రావణ్‌రెడ్డి, నిర్మల్
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం
మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జనరల్ ఆస్పత్రికి కార్డియాలజిస్ట్ పో స్టులు కేటాయించలేదు. గుండె సమస్యతో వచ్చిన వారికి జనరల్ ఫిజీషియ న్‌తో ప్రాథమిక వైద్యం చేయిస్తున్నాం. ఈసీజీ తీయించి పరిస్థితిని బట్టి ఇక్కడే వైద్యం అందిస్తున్నాం. 2డీ ఎకో అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడికే ప్రైవేట్ కార్డియాలజిస్టును పిలి పించి పరీక్షలు చేయిస్తున్నాం. పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. – డాక్టర్ గోపాల్‌సింగ్,
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
లక్ష్మణచాంద మండలం మల్లాపూర్‌కు చెందిన లింగన్న (46) హైడ్రోసిల్‌తో బాధపడుతూ ఈనెల 4న నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. వైద్యులు పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పారు. వయస్సు రీత్యా 2డీ ఎకో చేయాలి. ఈ పరికరం ఉన్నా కార్డియాలజిస్టులు లేరు. ఆరోగ్యశ్రీ పథకంలో ప్రైవేట్ కార్డియాలజిస్టును పిలిపించి ఈ పరీక్ష చేయించారు. ఈనెల 5న ఆయనకు హైడ్రోసిల్ ఆపరేషన్ చేశారు. జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ పోస్టులు భర్తీ చేసి 2డీ ఎకో పరికరం అందుబాటులోకి తీసుకురావాల్సి అవసరం ఎంతైనా ఉంది.
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కేంద్రం ఏర్పడ్డాక ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి ఏటా 150 మంది వైద్య విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల నుంచి 330 పడకల స్థాయి కి పెంచారు. 20 విభాగాల్లో 22 మంది డాక్టర్లు, 201 మంది నర్సింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. కానీ గుండె సంబంధిత వైద్యులు లేరు. కార్డియాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు డాక్టర్ పోస్టులు మంజూరు చేయలేదు.
పెరుగుతున్న పేషెంట్లు
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, కాలుష్యంతో జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిర్మల్ ఆస్పత్రికి సీజన్‌ను బట్టి ప్రతీరోజు 800 నుంచి 1000 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తారు. ఇందులో 40 మందికి పైగా గుండె సమస్యలతో వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముందుగా వారికి ఈసీజీ, 2డీ ఎకో, యాంజియోగ్రామ్ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కార్డియాలజిస్టులు లేక ఛాతిలో నొప్పి, ఇతర సమస్యలతో వచ్చిన వారిని జనరల్ ఫిజీషియన్ చూస్తున్నారు. పరీక్షలు చేసేందుకు 2డీ ఎకో మిషన్లు ఉన్నా.. ఆపరేట్ చేసే టెక్నీషియన్లు లేరు. స్టాఫ్‌నర్సు, ఇతర ఉద్యోగులతో ఈసీజీ తీయిస్తున్నారు. మిగిలిన పరీక్షలకు మిషన్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ డాక్టర్లు లేక హైదరాబాద్, నిజామాబాద్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యం సకాలంలో అందక మార్గమధ్యలో రోగులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి.
రూ.లక్షల్లో ఖర్చులు
ఇటీవల జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే నిర్మల్ ప్రజలకు గుండెపోటు వస్తే అంతే సంగతులు.. అనే విధంగా మారాయి పరిస్థితులు. ఇటు ప్రభుత్వ ఆస్పత్రి.. అటు ప్రైవేట్‌లో సరైన వైద్య నిపుణులు అందుబాటులో లేక అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో రూ.లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేక బాధితులు అవస్థలు పడుతుండగా.. మరికొందరు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. జి ల్లా జనరల్ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో వచ్చే బాధితులకు ప్రాథమిక చికిత్స అందుబాటులో లేకుండా పోయింది. ఇక్క డ 2డీ ఎకో మిషన్ అందుబాటులో ఉన్నా టెక్నీషి యన్ లేక నిరుపయోగమైంది. ఇక ఈసీజీ అందుబాటులో ఉన్నా రిపోర్ట్ సక్రమంగా వస్తుందా.. రాదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్‌లోనూ అంతే..
నిర్మల్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో రెండు క్యాథ్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఇద్దరు కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్న కార్డియోథొరాసిక్ సర్జన్లు ఒక్కరూ లేరు. గుండెకు సంబంధించి చిన్నపాటి సర్జరీ చేయాలన్నా హైదరాబాద్ నుంచి టీమ్‌లను ఇక్కడకు రప్పిస్తున్నారు. రోగుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. చాలావరకు మేజర్ సర్జరీలు ఉంటే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. స్థానికంగా రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొంతమేర సేవలు అందుబాటులో ఉన్నా ఫీజులు భారీగా ఉంటున్నాయి. యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. ఒకవేళ స్టంట్ వేయాల్సి వస్తే అదనంగా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండడంతో కొంతమేర నిరుపేదలు లాభపడుతున్నారు.

గుండెపోటా..వైద్యులు లేరు!

గుండెపోటా..వైద్యులు లేరు!

గుండెపోటా..వైద్యులు లేరు!