‘ఆయిల్‌పామ్‌’ అడ్డుకుంటున్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

‘ఆయిల్‌పామ్‌’ అడ్డుకుంటున్న ఎమ్మెల్యే

Mar 11 2025 12:15 AM | Updated on Mar 11 2025 12:14 AM

నిర్మల్‌టౌన్‌: ఆయిల్‌పామ్‌ పరిశ్రమ ప్రారంభం కాకుండా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అడ్డుకుంటున్నాడని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఆయిల్‌పామ్‌ రైతులతో కలిసి ‘రైతుధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాక్‌పట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన ఆయిల్‌పామ్‌ పరిశ్రమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలోని 1600 మంది రైతులు 8,488 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేశారని, పంటను విక్రయించేందుకు సోన్‌ మండలంలోని పాకుపట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈ ఏడాది ఆఖరి వరకు పంట చేతికి వస్తుందని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. అన్నిశాఖల నుంచి అనుమతులు వచ్చినా తనకున్న పలుకుబడితో నీటి పారుదల శాఖ క్లియరెన్స్‌ ఇవ్వకుండా అధికారిపై ఒత్తిడి తీసుకువచ్చి, ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా చేస్తున్నారన్నారు. నిర్మల్‌ ప్రాంత అభివృద్ధికి తాను నిధులు తీసుకువస్తే వాటితో చేపట్టే పనుల్లో పర్సంటేజీలు కావాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు అడ్డుకుంటున్నారన్నారు. జిల్లాలో రూ.27 కోట్లతో నాలుగు చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తయినా తనకు పర్సంటేజ్‌ ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని ఒత్తిడి తేవడంతో ఆగిపోయాయన్నారు. అనంతరం కలెక్టర్‌ అభిలాష అభినవ్‌కు, ఆర్డీవో కార్యాలయంలోనూ రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అరుగుమీది రామయ్య, నాయకులు పాకాల రాంచందర్‌, అనుముల భాస్కర్‌, మురళీధర్‌రెడ్డి, ముడుసు సత్యనారాయణ, శ్రీధర్‌, వొస రా జేశ్వర్‌, పూదరి సాయికృష్ణ, రైతులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

జిల్లా కేంద్రంలో రైతు ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement