లింకులతో ఇక్కట్లు..
యూరియ కోసం గ్రోమోర్ ఫర్టిలైజర్‌తోపాటు, ప్రైౖవేట్ డీలర్ల వద్దకు వెళ్తే వారుగంట గుళికలు, పొటాషియం కొనుగోలు చేయాలని లింకు పెడుతున్నారు. ఫిబ్రవరి 18న ఖానాపూర్ పట్టణంలోని గోమ్రోర్ సెంటర్‌కు వెళ్లిన రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఖానాపూర్: జిల్లాలో యాసంగి పంటలకు యూరియా దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల్లో కలుపుతీత పనులు చేపడుతున్నారు. కలుపు తీసిన వెంటనే పంటలకు యూరియా వేయాలి. దీంతో రైతులు యూరియా కోసం సొసైటీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అంతా ఒకేసారి యూరియా కోసం వస్తుండడంతో సొసైటీలకు వస్తున్న ఎరువు చాలడం లేదు. అదనుకు యూరియా వేయకుంటే పంట ఎదగక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, లోకేశ్వరం తదితర మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. రైతులు పీఏసీఎస్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో పంటల సాగు వివరాలు..
జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1.10 లక్షల ఎకరాల్లో వరి, 1,02 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ పంటలు సాగు చేశారు. యాసంగి పంటలకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. అయినా రైతుల ఇంకా యూరియా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు మరో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు సరఫరా అవుతోంది. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయడంతోపాటు సాగు చేసిన పంటలకు సైతం ఎక్కువగా వినియోగించడంతోనే కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
మూడు రోజులుగా తిప్పలు..
ఖానాపూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం ఖానాపూర్, పెంబి మండలాలకు చెందిన రైతులు మూడు రోజులుగా వేకువ జామునే పీఏసీఎస్‌ల ఎదుట బారుతులు తీరుతున్నారు. కొద్ది రోజులుగా కార్యాలయాలు, దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా దొరకకపోవడంతో వెనుదిరుగుతున్నారు.
తప్పని అగచాట్లు..
వారం రోజులుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. శుక్ర, శనివారాల్లో వేకువ జామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద వరుసలో చెప్పులు పెట్టి కాలకృత్యాలు, టీ, టిఫిన్ లేకుండా పడిగాపులు కాస్తే తప్ప యూరియా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంటలకు యూరియా అవసరమని, అదనుకు అందకుంటే పంటలు ఎదగక నష్టపోతామని పేర్కొంటున్నారు.
ఖానాపూర్ పీఏసీఎస్ ఎదుట వరుసలో చెప్పులతో పడిగాపులు కాస్తున్న రైతులు
జిల్లాలో యూరియా కొరత
అదనుకు అందక రైతుల ఆందోళన
సొసైటీల వద్ద అన్నదాతల బారులు
కొరత లేకుండా చూస్తున్నాం
జిల్లాకు ఈ యాసంగిలో గత ఏడాదికంటే ఎక్కువగా యూరియా తెప్పించాం. జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదు. రైతులు ఆందోళన చెందవద్దు. మరో 4 రోజుల్లో 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. రైతులు యూరియా వినియోగంపై స్థానిక వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అవసరానికి మించి వాడిడం అనర్థమే.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి