సిరాల ప్రాజెక్టు కెనాల్‌తో ఇలేగాం కొత్త చెరువు, బాపూజీ మహారాజ్ చెరువు, దేగాం గ్రామంలోని మరో రెండు చెరువుల్లో నీరుండేది. ప్రాజెక్టు తెగడంతో కింద ఉన్న నాలుగు చెరువులు వట్టిపోయాయి. వేసవిలో పశువుల దప్పిక తీర్చేందుకు నీటితో ఉండే ఈ చెరువులన్నీ ఎడారిలా మారిపోయాయి. ఎండలు ముదురుతున్నకొద్దీ పశుపక్షాదులు నీటి కోసం అల్లాడుతున్నాయి. వన్య ప్రాణులకు సైతం నీరు దొరకడంలేదు. సిరాల ప్రాజెక్టు గుట్ట చుట్టూ జింకలు, కుందేళ్లు, నెమళ్లు, అడవి పందులు సంచరిస్తుండేవి. వన్య ప్రాణులన్నీ ప్రాజెక్టులో ఉన్న నీటినే తాగి జీవించేవి. ప్రాజెక్టులో నీరు లేక వన్యప్రాణులకు నీటి ఇక్కట్లు తప్పడంలేదు.