
ఫరూఖ్‌బాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖ్‌బాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహిత(33).. స్కూటీపై వెళ్తుండగా అడ్డగించిన యువకుడు, అతని స్నేహితులు ఆమెకు నిప్పంటించారు. నిషా సింగ్ అనే మహిళను యువకుడు దీపక్ గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, మంటల్లో కాలుతూనే స్కూటీ నడుపుతూ ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
తమతో మాట్లాడాలంటూ దీపక్, అతని స్నేహితులు ఆ మహిళపై ఒత్తిడి తెచ్చారు. ఆమె మాట్లాడానికి నిరాకరించడంతో వారి మధ్య వాదన జరిగింది. దీంతో ఆ మహిళకు నిప్పు పెట్టారని పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 6న ఈ సంఘటన జరిగింది.
మృతురాలి తండ్రి బాల్రామ్ సింగ్ తన కుమార్తెను ఒక వ్యక్తి, అతని స్నేహితులు ఆగస్టు 6న సజీవ దహనం చేశారంటూ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పరిస్థితి గురించి డాక్టర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో తాను ఆసుపత్రికి వెళ్ళానని బాధితురాలి తండ్రి చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
"డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ కూతురు చాలా తీవ్రంగా కాలిపోయిందని.. త్వరగా రండి అని చెప్పారు. నేను అక్కడికి చేరుకునేసరికి ఆమె చాలా దయనీయమైన స్థితిలో ఉంది. 'నాన్నా నన్ను రక్షించు' అని అరుస్తోంది. దీపక్ తనకు నిప్పు పెట్టాడని చెప్పింది. ఆ వ్యక్తి తనతో మాట్లాడమని, కలవమంటూ బలవంతం చేసేవాడని తన కూతురు చెప్పిందని తండ్రి బాల్రామ్ సింగ్ తెలిపారు. నిషా సింగ్ భర్త మాట్లాడుతూ.. వేధింపులు గురించి తన భార్య ఎప్పుడూ చెప్పలేదన్నారు.