వేసవి సెలవులు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రయాణాలు, సందడి. ఎండలు మండిపోతున్నా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు చాలా మంది. వేసవి సెలవులు అంటేనే వచ్చే ఉత్సాహం వేరు. చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి చాలామంది హిల్ స్టేషన్లకు వెళ్తుంటారు.
ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, మనాలీ, అరకు వ్యాలీ వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. ప్రకృతి ఒడిలో, పచ్చని కొండలు, జలపాతాలు, చల్లని గాలి మనసుకు ఎంతో హాయినిస్తాయి. డబ్బున్న వారు విదేశాలకు వెళ్తుంటారు. బిజీగా ఉండే తల్లిదండ్రులకు, చదువులతో అలసిపోయిన పిల్లలకు ఈ సెలవులు ఒక వరప్రసాదం. పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు. అయితే, ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరతలు వేసవి సెలవుల ఎంజాయ్‌మెంట్‌ను చెడగొడతాయా?
ఏం జరుగుతోంది?
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం వల్ల ఏర్పడిన సరఫరా సమస్యల కారణంగా డీజిల్, జెట్ ఇంధన కొరతలు పెరిగి వేసవి సెలవుల్లో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. హార్మూజ్ జలసంధి ఇంకో 2 లేదా 3 నెలలు మూసి ఉంటే ప్రపంచం మొత్తం.. కొన్ని ఆసియా దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లే ఇంధన కొరతలు ఎదుర్కొంటుందని నిపుణులు చెప్పారు.
ఫిబ్రవరి చివరలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ చమురు, ఎల్ఎన్‌జీ సరఫరాలో సుమారు ఐదవ వంతు వెళ్లే హార్మూజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసివేసింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రోజుకు సుమారు 11 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెట్‌కు రాకుండా నిలిచిపోతోంది.
గల్ఫ్ ప్రాంత రిఫైనరీలు కూడా పెద్ద మొత్తంలో డీజిల్, జెట్ ఇంధనం ఉత్పత్తి చేస్తాయి. ఈ సరఫరాలు లేకపోతే ప్రపంచంలో తీవ్ర ప్రభావాలు తప్పవని నిపుణులు చెప్పారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కొన్ని ఇప్పటికే ఇంధనం లేదా విద్యుత్‌ను పరిమితంగా వినియోగించాల్సి వచ్చింది. యూరోపియన్ కమిషన్, సభ్య దేశాలు కనీసం తాత్కాలికంగా సరఫరాలపై భరోసా ఇవ్వడానికి ప్రయత్నించాయి.
వేసవిలో ఎందుకు ఆందోళన?
వేసవిలో కుటుంబాలు కార్లలో ప్రయాణించడం లేదా విమానాల్లో సెలవులకు వెళ్లడం ఎక్కువగా ఉంటుంది. సరఫరా తగ్గినప్పుడు ఆసియా, యూరప్ మధ్య పోటీ పెరుగుతుంది. ఇదే పరిస్థితి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత కనపడింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ఇంధన కొరత వల్ల ఇప్పటికే చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.
ఒక ఇంధన రంగ నిపుణుడు చెప్పిన వివరాల ప్రకారం.. యూరప్ అధిక ధరలు చెల్లించి ఇంధన కొరతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో యూరప్ ముందుగా ధరల షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ గల్ఫ్ నుంచి సరఫరాలు నిలిచిపోతే కొరతలు కూడా ఏర్పడవచ్చు.
రిస్టాడ్ ఎనర్జీ సంస్థలో ఆయిల్ మార్కెట్లు, డౌన్‌స్ట్రీమ్ వైస్ ప్రెసిడెంట్ జనివ్ షా తెలిపిన వివరాల ప్రకారం.. వేసవిలో యూరప్‌లో డీజిల్, జెట్ ఇంధన కొరతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పశ్చిమాసియా, ఆసియా నుంచి వచ్చే కీలక సరఫరాలు ప్రస్తుత అంతరాయం వల్ల తగ్గాయి. విమానయాన సంస్థలు జెట్ ఇంధన ధరలు పెరగడంతో టికెట్ ధరలు పెంచాయి, కొన్ని విమానాలను తగ్గించాయి. కొన్ని వారాల్లోనే జెట్ ఇంధన కొరతలు రావచ్చన‍్న సూచనలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఇంధన కమిషనర్ డాన్ జోర్గెన్సెన్ స్కై న్యూస్‌కు చెప్పిన వివరాల ప్రకారం.. దురదృష్టవశాత్తు చాలా మంది సెలవులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాలు రద్దు కావచ్చు లేదా టికెట్లు చాలా ఎక్కువ ధరలకు లభించవచ్చు.
చాలా దేశాల వద్ద వ్యూహాత్మకంగా చమురు నిల్వలు ఉంచుకున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థలో భాగమైన దేశాలు యుద్ధం ప్రారంభ దశలోనే ధరలు పెరగకుండా ఆ నిల్వలను వినియోగించాయి. కొరతలు రాకుండా మళ్లీ వాటిని ఉపయోగించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు రిఫైనరీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో డీజిల్, జెట్ ఇంధన ఉత్పత్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది.


