జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? | Sakshi
Sakshi News home page

Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?

Published Tue, Jan 30 2024 10:05 AM

జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం? - Sakshi

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం (జనవరి 29) ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లింది. అయితే అక్కడ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో, ఈడీ స్క్వాడ్ 13 గంటలకు పైగా అక్కడే మకాంవేసి, సీఎం నివాసంలో సోదాలు జరిపింది. 

దర్యాప్తు సంస్థ జార్ఖండ్ సీఎం నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారు (హర్యానా నంబర్‌తో నమోదైంది)ను స్వాధీనం చేసుకుంది. అలాగే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఈడీ చర్యను హేమంత్ సోరెన్ పరువు తీసేందుకు చేసిన ప్రణాళికాబద్ధమైన కుట్రగా అభివర్ణించింది. మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 18 గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది.

సోమవారం నాడు ఢిల్లీ పోలీసులతో కలిసి ఈడీ బృందం దక్షిణ ఢిల్లీలోని  ఆయన నివాసమైన శాంతి నికేతన్ భవన్‌కు ఉదయం 9 గంటల ప్రాంతంలో చేరుకుంది. రాత్రి 10:30 గంటల వరకు ఈడీ బృందం అక్కడే ఉంది. సోరెన్ నివాసం నుంచి బీఎండబ్ల్యూ కారును, కొన్ని పత్రాలను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సీఎం సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లారని ఆయన పార్టీ జేఎంఎం తెలిపింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యకు భయపడి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత 18 గంటలుగా పరారీలో ఉన్నారని బీజేపీ జార్ఖండ్ యూనిట్ పేర్కొంది. 

భూ కుంభకోణం కేసులో జనవరి 20న రాంచీలోని సీఎం అధికారిక నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోరెన్‌ను ప్రశ్నించింది. అనంతరం జనవరి 29 లేదా జనవరి 31న విచారణకు హాజరుకావాలని కోరుతూ ఈడీ సమన్లు ​​జారీ చేసింది. దీనికి స్పందిస్తూ సోరెన్ ఏజెన్సీకి లేఖ పంపారని, అయితే తాను విచారణకు హాజరయ్యే తేదీని దానిలో పేర్కొనలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆదివారం (జనవరి 28) ఈడీకి పంపిన ఈ మెయిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అడ్డుకోవడానికి రాజకీయ ఎజెండాతో తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని సోరెన్ ఆరోపించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement