డిజిటల్‌ హౌస్‌ అరెస్ట్‌ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి? | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ హౌస్‌ అరెస్ట్‌ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి?

Published Thu, May 2 2024 1:01 PM

What is Digital House Arrest

జనాన్ని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాలను కనుగొంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ పేరిట నూతన తనహా వంచనకు తెర లేపుతున్నారు.  

ఈ పద్దతిలో సైబర్ నేరగాళ్లు పోలీసు, సీబీఐ లేదా కస్టమ్స్ అధికారులుగా నటించి, తాము టార్గెట్‌ చేసుకున్న వారికి ఫోన్ చేసి, వారిని ఇంట్లో బందీలుగా మారుస్తున్నారు. అనంతరం వారి బ్యాంక్ ఖాతాలోని సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఇదే కోవలో ఇంటి తాకట్టు మోసానికి సంబంధించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

ఆర్‌బీఐ  ఇటీవల వెలువరించిన ఒక నివేదికలోని వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రూ. 302.5 బిలియన్లు అంటే రూ. 30 వేల కోట్లకు పైగా డిజిటల్‌ మోసాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో అంటే జూన్ 1, 2014 నుండి మార్చి 31, 2023 వరకు భారతీయ బ్యాంకులలో 65,017 మోసం కేసులు నమోదయ్యాయి. రూ. 4.69 లక్షల కోట్ల మేరకు చీటింగ్‌ జరిగింది. యూపీఐ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, ఓటీపీ స్కామ్, జాబ్ స్కామ్, డెలివరీ స్కామ్ మొదలైన వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతి ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది.

మోసగాళ్లు తాము టార్గెట్‌ చేసుకున్నవారిని ఇంట్లో బంధించి, వారిని మోసం చేసేందుకు  ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆడియో, వీడియో కాల్స్ చేస్తూ, అలజడి వాతావరణాన్ని సృష్టిస్తారు. స్కామర్‌లు ఏఐ సాయంతో రూపొందించిన వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా పోలీసులు లేదా అధికారుల మాదిరిగా నటించి, బాధితుల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్‌తో తప్పులు దొర్లాయని చెబుతారు. ఇంతటితో ఆగకుండా ఆ మోసగాళ్లు అధికారులుగా నటిస్తూ, తాము టార్గెట్‌ చేసుకున్నవారిని ఇళ్లలో బంధించి, వారికి అరెస్టు భయం కల్పించడంతోపాటు, వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో అరెస్టు, పరువు నష్టం భయంతో బాధితులు స్కామర్ల ఉచ్చులో సులభంగా పడిపోతారు. దీంతో నిండా మోసపోతుంటారు.

ఈ రకమైన మోసానికి గురికాకుండా ఉంటాలంటే విజిలెన్స్  సహకారం అవసరం. ఎవరికైనా  ఇలాంటి బెదిరింపు కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు విజిలెల్స్‌ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఇటువంటి సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథి వెబ్‌సైట్‌లో చక్షు పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి తోడు ఇలాంటి మోసాల బారిన పడినవారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్‌ చేయకూడదు. ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థ  ఎవరినీ పిన్, లేదా ఓటీపీని అడగదు.  ఇటువంటి సందర్భాల్లో పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఆన్‌లైన్ మోసాల నివారణకు సోషల్ మీడియాతోపాటు బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం ఉత్తమమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement