తమిళనాడు సీఎం విజయ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ | Vijay Surprise Meetings With Opposition Leaders Stalin Among | Sakshi
Sakshi News home page

తమిళనాడు సీఎం విజయ్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌

May 11 2026 1:24 PM | Updated on May 11 2026 5:42 PM

Vijay Surprise Meetings With Opposition Leaders Stalin Among

సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్‌ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. 

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్‌ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ  అయ్యారు. స్టాలిన్‌ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్‌తో విజయ్‌ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్‌తో విజయ్‌ సమావేశమయ్యారు. 

అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. 

ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.  టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.

స్టాలిన్ ఇంటికి చేరుకున్న సీఎం విజయ్

ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్‌ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement