తిరువొత్తియూరు: తిరుచ్చి నవ్‌లూర్ కుట్టపట్టు, వన్నంకోవై ప్రాంతానికి చెందిన జార్జ్ విలియం సేతురాజ్ (33) పెట్రోల్ బంక్ ఉద్యోగి. ఇతను నటుడు విజయ్‌కు వీరాభిమాని. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళగ వెట్రి కళగం లో తీవ్రంగా పనిచేశాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో అతను ఎంతో సంతోషించాడు.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం అతడిని కొంత ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫలితాల కోసం 24 గంటలూ టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆదివారం అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దశ్యాలను టీవీలో చూస్తుండగా, జార్జ్ విలియమ్‌కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే తన బైక్ మీద భార్యను కూర్చోబెట్టుకుని 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు.
మార్గమధ్యంలో నొప్పి ఎక్కువవడంతో, అక్కడి నుంచి కారులో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే జార్జ్ విలియం ప్రాణాలు విడిచాడు. అతిగా కలిగిన ఆనందంతో వచ్చిన గుండెపోటు మరణానికి కారణమని చెబుతు న్నారు. మరణించిన జార్జ్ విలియం కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతనికి 4 ఏళ్ల కవల పిల్ల లు ఉన్నారు. అందులో జోస్వ అనే బాబు మూగవాడు (దివ్యాంగుడు). జార్జ్ తల్లిదండ్రులు కూడా వద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి విజయ్ అండగా నిలవాలని బంధువులు, స్థానికులు కన్నీళ్లతో కోరుతున్నారు.


