చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ‘గీతాలాపన’ వివాదం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం గురువారం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార ఉత్సవంలో అధికారిక గీతాల ఆలపన క్రమం తీవ్ర దుమారానికి దారితీసింది. సంప్రదాయకంగా పాడే ‘తమిళ్ తాయ్ వాజ్తు’ (తమిళ మాత వందనం)కు ముందే ‘వందేమాతరం’ ఆలపించడంపై ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నాయి. ఇటు తమిళ అస్తిత్వం, అటు జాతీయ ప్రొటోకాల్ మధ్య నడుస్తున్న ఈ రాజకీయ యుద్ధం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ సర్కార్‌పై డీఎంకే, సీపీఐ ఆగ్రహం
తాజా మంత్రివర్గ విస్తరణలో భాగంగా 23 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ కార్యక్రమంలో ‘వందేమాతరం’ మొదటి స్థానంలో, జాతీయ గీతం ‘జనగణమన’ రెండో స్థానంలో ఆలపించగా, ‘తమిళ్ తాయ్ వాజ్తు’ను మూడో స్థానానికి పరిమితం చేశారు. దీనిపై ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తీవ్రంగా మండిపడింది. తమిళ గుర్తింపును, సంస్కృతిని కాపాడటంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) విఫలమైందని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై విమర్శించారు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ గీతానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత మార్పు గత సంప్రదాయాలను ఉల్లంఘించడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ ఆదేశాల మేరకే ఈ తప్పు జరిగిందని ఆయన ఆరోపించారు.
కౌంటర్ ఇచ్చిన బీజేపీ: అది ‘నేషనల్ ప్రొటోకాల్’
ప్రతిపక్షాల విమర్శలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అంతే తీవ్రంగా స్పందించింది. ప్రమాణ స్వీకార ఉత్సవాల్లో ఇతర గీతాల కంటే ముందు ‘వందేమాతరం’ ఆలపించడం అనేది ‘నేషనల్ ప్రొటోకాల్’ (జాతీయ నియమావళి) అని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ‘తమిళ మాతను ఎవరూ అవమానించలేరు, తమిళ మాత ఎల్లప్పుడూ జాతీయవాదాన్ని గౌరవిస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. డీఎంకే దేశ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని, అందుకే ప్రజలు వారికి గతంలోనే బుద్ధి చెప్పారని ఆమె కౌంటర్ ఇచ్చారు.
కేరళలోనూ ఇదే సెగ.. దేశవ్యాప్తంగా చర్చ
ఈ వివాదం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు, పొరుగు రాష్ట్రమైన కేరళలోనూ ఇటువంటి చర్చకు దారితీసింది. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేబినెట్ ప్రమాణ స్వీకారంలో ‘వందేమాతరం’ పూర్తి వెర్షన్‌ను ఆలపించడంపై సీపీఐ(ఎం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక బహుళత్వ సమాజంలో ఇది సరైనది కాదని, ఆ గీతంలోని కొన్ని భాగాలు మతపరమైన అంశాలతో కూడి ఉన్నాయని లెఫ్ట్ పార్టీలు ఆరోపించాయి. అయితే లెఫ్ట్ పార్టీల వ్యాఖ్యలు జాతీయ గీతాన్ని అవమానించడమేనని, తుష్టీకరణ రాజకీయాల్లో భాగమేనని కేరళ బీజేపీ నేతలు తిప్పికొట్టారు. మొత్తానికి ‘వందేమాతరం’ చుట్టూ ముసురుకున్న ఈ వివాదం దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.


