కోలకతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న, గుర్తింపు పొందిన మదరసాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం జరిగే అసెంబ్లీ ప్రార్థనల్లో ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి విధిగా మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన అధికారిక నోటీసు సరికొత్త చర్చకు తెరలేపింది. తరగతులు ప్రారంభం కావడానికి ముందే విద్యార్థులందరూ తప్పనిసరిగా జాతీయ గేయాన్ని పాడేలా చర్యలు తీసుకోవాలని విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు
జాతీయ గేయమైన ‘వందేమాతరం’నకు రూపకల్పన జరిగిన 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆదేశాల అనుగుణంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉదయపు ప్రార్థనల సమయంలో వందేమాతరం ఆలపించేలా చూడాలని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే జాదవ్‌పూర్ విద్యాపీఠ్ వంటి పలు ప్రముఖ విద్యాసంస్థలు ఈ నిబంధనను అమలు చేయడం ప్రారంభించాయి.
West Bengal: Directorate of Madrasah Education has made the singing of “Vande Mataram” mandatory during assembly prayers before classes in all government, aided, and recognised madrasahs across the state with immediate effect pic.twitter.com/6MK8h0D3YR
— IANS (@ians_india) May 20, 2026
రాష్ట్ర గేయంపై సందిగ్ధత
గత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర పాఠశాలల్లో ‘బాంగ్లార్ మాటి బాంగ్లార్ జల్’ (రాష్ట్ర గేయం) పాడటాన్ని నిర్బంధం చేసింది. అయితే, తాజా ఉత్తరవుల్లో కేవలం వందేమాతరం గురించి మాత్రమే ప్రస్తావించడంతో, పాత నిబంధన కొనసాగుతుందా లేదా అనే అంశంపై పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ అధికారులు సైతం కొత్త ఆదేశాలలో రాష్ట్ర గేయం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని, కేవలం వందేమాతరం ప్రార్థనను చేర్చాలని మాత్రమే సూచించినట్లు స్పష్టం చేశారు.
సమయాభావంపై ఉపాధ్యాయుల ఆందోళన
ఈ కొత్త నిబంధన వల్ల పాఠశాలల్లో సమయపాలన దెబ్బతినే అవకాశం ఉందని కొందరు పాఠశాలల అధిపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ జాతీయ గీతమైన ‘జనగణమన’ పాడటం తప్పనిసరి, దానికి తోడు ఇప్పుడు ‘వందేమాతరం’ చేరింది. ఒకవేళ రాష్ట్ర గేయాన్ని కూడా కొనసాగిస్తే, విద్యార్థులు వరుసగా మూడు పాటలు పాడాల్సి వస్తుందని, దీనివల్ల ఉదయపు ప్రార్థనల సమయం ఎక్కువై తరగతులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.


