కలిసి పనిచేద్దాం! | US Secretary of State Marco Rubio meets PM Modi on his first India visit | Sakshi
Sakshi News home page

కలిసి పనిచేద్దాం!

May 24 2026 2:15 AM | Updated on May 24 2026 2:15 AM

US Secretary of State Marco Rubio meets PM Modi on his first India visit

ప్రపంచ సౌభాగ్యం, శాంతి కోసం కృషి చేద్దాం 

ప్రధాని మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో నిర్ణయం 

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు చేరుకున్న రూబియో  

ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయన్న మోదీ 

పశ్చిమాసియా పరిణామాలను వివరించిన రూబియో  

న్యూఢిల్లీ:  ప్రపంచ సౌభాగ్యం, శాంతి కోసం ఇకపైనా కలిసికట్టుగా పని చేయాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిణామాలను మోదీకి వివరించారు. 

రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వ్యాపారం, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి కీలక రంగాల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారంపై వారిద్దరూ చర్చించుకున్నారు. రూబియో శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్దిసేపటికే మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించబోతున్నారు. గత ఏడాది కాలం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పునఃసమీక్షించే ప్రయత్నంగా రూబియో పర్యటనను నిపుణులు పరిగణిస్తున్నారు. 

రూబియోను కలవడం ఆనందంగా ఉందంటూ మోదీ సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు. భారత్‌–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నిరంతర పురోగతి, ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతకు సంబంధించిన అంశాలపై తాము చర్చించామని వెల్లడించారు. రెండు దేశాలు నిరంతరం సన్నిహితంగా కలిసి పనిచేస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్య, రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై సహకారాన్ని వేగవంతం చేయడానికి మోదీ, రూబియో అంగీకరించారని అమెరికా విదేశాంగ శాఖ తెలియజేసింది.  

భారత్‌ అత్యంత ముఖ్యమైన భాగస్వామి  
భారత్, అమెరికాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి రూబియో ప్రధాని మోదీకి వివరించారని భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారత్‌ నిరంతరం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారని పేర్కొన్నాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారని స్పష్టంచేశాయి. 

మోదీ, రూబియో మధ్య ఫలవంతమైన సమావేశం జరిగిందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడించారు. భారత్‌ తమకు అత్యంత ము ఖ్యమైన భాగస్వామి అని రూబియో తేల్చిచెప్పారు. మోదీతో భేటీ అనంతరం అమెరికా ఎంబసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు రాబోయే రో జుల్లో ఇరుపక్షాలు కొన్ని కీలక ప్రకటనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయని తెలిపారు. ఇండో–పసిఫిక్‌ విషయంలో వాషింగ్టన్‌ విధానానికి భారతదేశం ‘ఒక మూలస్తంభం’అని అభివరి్ణంచారు.

మోదీకి అమెరికా ఆహ్వానం  
త్వరలో అమెరికా పర్యటించాలని, వైట్‌హౌస్‌ను సందర్శించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరపున మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ విషయం అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తెలియజేశారు. మోదీతో భేటీ సందర్భంగా ఈ ఆహ్వానం అందించారని చెప్పారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని రూబియోను మోదీ కోరారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్‌తో సంభాషణ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారని వెల్లడించింది.

కోల్‌కతాలో మదర్‌ హౌస్‌ను సందర్శించిన రూబియో  
నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మార్కో రూబియో తొలుత కోల్‌కతాలో అడుగుపెట్టారు. సెర్గియో గోర్‌ ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు కోల్‌కతాలో పర్యటించడం 14 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2012 మే నెలలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ఇక్కడ పర్యటించారు. మార్కో రూబియో కోల్‌కతాలో ప్రఖ్యాత మదర్‌ హౌస్‌ను సందర్శించారు. ఇది భారత రత్న మదర్‌ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ’ ప్రదాన కార్యాలయం. మదర్‌ హౌస్‌ అధికారులతో రూబియో మాట్లాడారు. అనంతరం నిర్మల శిశు భవన్‌ కూడా సందర్శించారు. ఇది మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పిల్లల సంరక్షణ కేంద్రం. రూబియో ఈ నెల 26వ తేదీ వరకు భారత్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘క్వాడ్‌’దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవుతారు. ఢిల్లీతోపాటు ఆగ్రా, జైపూర్‌లో పర్యటిస్తారు.   

Advertisement
 
Advertisement
Advertisement