నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు | Union Home Minister Amit Shah is angry over opposition parties | Sakshi
Sakshi News home page

నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారు

Apr 18 2026 4:51 AM | Updated on Apr 18 2026 4:51 AM

Union Home Minister Amit Shah is angry over opposition parties

మహిళలకురిజర్వేషన్లు ఇవ్వడం, ఎస్సీ, ఎస్టీలకుసీట్లు పెరగడంప్రతిపక్షాలకుఇష్టం లేదు  

ప్రతిపక్షాలపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా ఆగ్రహం  

లోక్‌సభలో మూడు బిల్లులపై చర్చకు సమాధానం  

పునర్విభజనతో ఓటర్ల హేతుబద్దీకరణ జరుగుతుందని వెల్లడి  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నా యని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని ధ్వజమెత్తారు. మహిళల హక్కులకు ఎవరు అ డ్డుపడుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మహిళలే వారికి బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల హేతుబద్దీకరణకు వీలవుతుందని పేర్కొన్నారు. 

ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాలలో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో ఓటర్ల సంఖ్య దాదాపు సమానంగా ఉండేలా చేయడం డీలిమిటేషన్‌తో సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చకు అమిత్‌ షా సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన హక్కును ప్రజలకు దక్కకుండా చేసిందని, ఇప్పటికీ అదే పని చేస్తోందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తుండగా, విపక్ష ‘ఇండియా’కూటమి మాత్రం వ్యతిరేకిస్తోందని విమర్శించారు. 

మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు. కాలానుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగం వీలు కల్పిస్తోందని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా వారికి సీట్లను పెంచే నిబంధనలు కూడా ఉన్నాయని తెలిపారు. డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా ఎస్సీ, ఎస్టీల సీట్ల పెంపును కూడా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. అమిత్‌ షా     ఇంకా ఏం మాట్లాడారంటే..  

పారదర్శకంగా పునర్విభజన  
‘‘ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు గల కారణాలపై సభలో చాలామందికి అనుమానాలు ఉన్నాయి. 2026 తర్వాత నిర్వహించే జనగణన అనంతరం జరిగే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ‘నారీశక్తి వందన అధినియం’లో పేర్కొన్నాం. 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీలిమిటేషన్‌ను నిలిపివేశారు. నిలిపివేసిన సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా మాత్రమే ‘నారీశక్తి వందన అధినియం’ను అమలు చేయగలం. అందుకే ఈ బిల్లు తీసుకొచ్చాం. 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న లోక్‌సభ స్థానాలు 127 వరకు ఉన్నాయి. 

ఇది ‘ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒక విలువ’అనే సూత్రానికి విరుద్ధం. కొన్నిచోట్ల 45 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉండగా, మరికొన్ని చోట్ల 6 లక్షల ఓటర్లకు ఒక ప్రతినిధి ఉన్నారు. దీనివల్ల ప్రతి ఓటు విలువ సమానంగా లేదు. తెలంగాణలోని మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో ఏకంగా 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎంపీ ఇంత భారీ జనాభా ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరు? ఈ అసమానతలను తొలగించి మహిళా రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలంటే పునర్విభజన అనివార్యం. పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

లిఖితపూర్వకంగా హామీ ఇస్తాం  
కుల గణనను ఆలస్యం చేయడానికి ప్రభు త్వం కుట్ర పన్నిందని, అందుకే హడావుడిగా మూడు బిల్లులు తీసుకొచ్చిందన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై లిఖితపూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. సభను గంటసేపు వాయిదా వేస్తే ఇప్పుడే ఆ సవరణ చేస్తాం.   

మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు
మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు తావులేదు. ‘ఇండియా’కూటమి బుజ్జగింపు రాజకీయాల కోసమే ముస్లిం రిజర్వేషన్ల డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది. దేశంలో ఓబీసీలకు అతిపెద్ద వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే. మండల్‌ కమిషన్‌ను ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. మోదీ ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించిన ఘనత మాదే. మహిళా సాధికారతకు బీజేపీ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. గ తంలో సుష్మా స్వరాజ్, ఆనందిబెన్‌ పటేల్‌ లాంటి వారికి సీఎంలుగా అవకాశం ఇచ్చాం.  

పీవీని కాంగ్రెస్‌ సొంత మనిషిగా చూడలేదు  
దేశంలో మహిళలకు రిజర్వేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రారంభించిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుదే. 1992లో 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్‌ సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పీవీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. పీవీ కాంగ్రెస్‌ నేత అయినప్పటికీ, ఆ పార్టీ ఆయనను ఏనాడూ సొంత మనిషిగా అంగీకరించలేదు. ఆయన మరణానంతరం భౌతికకాయానికి అవమానం జరిగింది. కాంగ్రెస్‌ పీవీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిన మహనీయుడు పీవీ పేరును గర్వంగా చెప్పండి. కాంగ్రెస్‌ ఆయనను విస్మరించడం శోచనీయం’’అని అమిత్‌ షా ఆక్షేపించారు.   

Advertisement
 
Advertisement
Advertisement