
వేగంగా క్షీణిస్తున్న ఊపిరితిత్తుల ఆరోగ్యంపై నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో యువత ఊపిరితిత్తుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఏడాదికి 81,700 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పెట్టే గణాంకాలివి. ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన ఈ సమస్య ఇప్పుడే మొదలుకావడమన్నదే ఆందోళన కలిగించే విషయం.
ట్రాఫిక్ రద్దీలో ఎక్కువ దూరం వెళ్లే నిపుణులు, కాలుష్య వాతావరణమున్న క్లాస్‌రూముల్లో ఎక్కువ సేపు కూర్చునే విద్యార్థులు విష పూరిత వాయువులను నిత్యం పీలుస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు నిపుణులు తేల్చారు. అయితే, ఈ సమస్య వారు ఎక్కువగా పనిచేసి, సమాజానికి ఉత్పాదకతను అందించే సమయానికి బయటపడుతోందని చెబుతున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెస్పికాన్ సదస్సులో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ వత్సలా అగర్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. శ్వాసకోశ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు.
‘స్వచ్ఛమైన గాలి నేడు విలాస వస్తువు కాదు. ఇదో ప్రాథమిక హక్కు. దీనినే మనం ప్రధాన అజెండాగా తీసుకోవాలి. యువత ఊపిరితిత్తులను రక్షించుకోవడమంటే దేశ ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని కాపాడుకోవడమే. దేశ వర్తమాన, భవిష్యత్తును ఈ కాలుష్యం చిదిమేకుండా చూసుకోవాలి’అని డాక్టర్ వత్సల పేర్కొన్నారు. ‘గతంలో ఊపిరితిత్తుల కేన్సర్, సీఓపీడీ, టీబీ వంటి వ్యాధులు వృద్ధుల్లోనే కనిపిస్తాయనే అనుకునేవాళ్లం. ప్రస్తుతం యువతలో ఇవి వేగంగా పెరుగుతున్నాయి’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రాణనష్టంతోపాటు ఆర్థిక విపత్తు భయాలను పెంచుతోందన్నారు.
→ ఉదయాన్నే పొగలో పరుగెత్తే యువత, ట్రాఫిక్‌లో అత్యధిక సమయం ప్రయాణించే ఉద్యోగులు, కలుíÙత తరగతి గదుల్లో కూర్చునే విద్యార్థుల ఊపిరితిత్తుల ఆరోగ్యం నిత్యం క్షీణిస్తోంది. కంటికి కనిపించని ఉత్పాతం దీర్ఘకాలంలో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.
→ వంటగదిలో వచ్చే పొగ కూడా మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచుతోంది. చిన్నారులపైనా కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా కేసుల సంఖ్య 14 శాతంగా ఉంది.
→ భారత్‌లో క్షయ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రతి లక్ష మందికి 195 కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
→ సూక్ష్మ రేణువులు, కాలుష్యం బారినపడకుండా తగ్గించడంతోపాటు సీఓపీడీ, ఆస్తమా, క్షయ వంటి కేసుల్లో నిబంధనలు పాటించినట్లయితే ఏటా వేల మంది ఆస్పత్రి చేరికలను తగ్గించుకోవచ్చని రెస్పికాన్ 2025 ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె.చావ్లా వెల్లడించారు.
→ నేటి యువత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోతే.. దేశ భవిష్యత్తు ఇబ్బందికంగా మారుతుందని రెస్పికాన్ 2025 నిర్వహణ కార్యదర్శి ఆదిత్య కె. చావ్లా పేర్కొన్నారు. శ్వాసకోశ ఆరోగ్య రక్షణపై ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సీనియర్ శ్వాసకోశ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు, అంతర్జాతీయ నిపుణులు సహా దాదాపు 1,200 మంది పాలు పంచుకున్నారు.
→ స్వచ్ఛమైన గాలి అందించడం, టీబీ బాధితుల సంరక్షణ, వ్యాక్సినేషన్‌ను పెంచడం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వంటి చర్యలపై నిపుణులు ఈ సమావేశంలో చర్చించారు. విషపూరిత గాలి సగటు భారతీయుల ఆయుర్దాయాన్ని వెయ్యి రోజుల మేర తగ్గిస్తోందని, చడీచప్పుడూ కాకుండా నష్టాన్ని కలిగిస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు.